ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అని ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా సూర్యాపేట లో అయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంత్రి… జగ్జీవన్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం.. రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నదని కొనియాడారు.
బాబూజీ స్ఫూర్తితోముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ని తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నాం అన్నారు.. ఎక్కడా లేని విధంగా తెచ్చిన దళితబంధు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది అని మంత్రి పేర్కొన్నారు. జగ్జీవన్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా కులాంతర వివాహాలు చేసుకున్న 50 జంటలకు ప్రోత్సహకం క్రింద కోటి రూపాయలను నగదు చెక్ లను మంత్రి అందజేశారు.
Also Read : దేశ ప్రజలను గెలిపిస్తాం – కెసిఆర్