Saturday, January 18, 2025
HomeTrending Newsకేంద్రంలో బ్రిటిష్ పాలన - దానం విమర్శ

కేంద్రంలో బ్రిటిష్ పాలన – దానం విమర్శ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న బీజేపీ జాతీయ నేతలకు తెలంగాణ అభివృద్ధిని చూసే సదవకాశం కలుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి బీజేపీ నేతలకు కనువిప్పు కలగాలన్నారు. హైదరాబాద్ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈ రోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ,ఎమ్మెల్యే జాజుల సురేందర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలను బీజేపీ సమావేశాల్లో చర్చించండని హితవు పలికారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వండని, తెలంగాణపై సవతి తల్లి ప్రేమను బీజేపీ మానుకోవాలన్నారు.

బండి సంజయ్ కొత్త బిచ్చగాడిలా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, వరద బాధితులకు 25 వేలు ఇస్తా అన్నాడు.. కేంద్రం నుంచి ఒక్క పైసా అయినా తెచ్చాడా అని దానం నాగేందర్ విమర్శించారు. కేంద్రంలో బ్రిటిష్ పాలన సాగుతోందని, నియోజకవర్గాలకు వెళ్లే బీజేపీ జాతీయ నేతలు అభివృద్ధి పై వాస్తవాలు చెప్పాలని సూచించారు. మోడీ అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారని, దేశానికి ఇప్పటిదాకా చేసిన మంచి పని ఒక్కటి లేదన్నారు. ప్రభుత్వాలను కూల్చడమే తప్ప బీజేపీకి వేరే పని లేదని, అగ్నిపథ్ స్కీంతో యువత ఆశలపై నీళ్లు చల్లారని దుయ్యబట్టారు. మోడీని చూసి కేసీఆర్ భయపడితే తెలంగాణ తెచ్చేవారా అన్నారు. కేసీఆర్ అంటే అభివృద్ధికి పర్యాయ పదం అన్న దానం నాగేందర్ మాట ఇచ్చి తప్పడం బీజేపీ నైజమన్నారు.
తెలంగాణకు ప్రత్యేక ప్రాజెక్టులు ఈ సమావేశాల్లో ప్రకటించాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులు ప్రకటించకపోతే మా కార్యాచరణ త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించకపోతే బీజేపీకి ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఉందని భావించాల్సి ఉంటుందని ఆరోపించారు.

Also Read : బీజేపీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు: కేటీఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్