దాశరథి చెప్పకపోయి ఉంటే తెలుగువారికి-
“ఆ చల్లని సముద్రగర్భంలో దాగిన బడబానలమెంతో”
తెలిసేదా?
దాశరథి వెతికి పట్టుకోకపోతే తెలుగువారికి-
“ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో?”
కనిపించేవారా?
భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాల దగ్గర మొదలుపెట్టి…ఈ భూమ్మీద కోట్ల కోట్ల ఏళ్ల పరిణామ క్రమంలో మానవరూపం ఏర్పడేదాకా దాశరథి కవిత్వీకరించకపోయి ఉంటే- మన ప్రస్తుత రూపం మీద పాడుకోవడానికి ఒక తెలుగు పాట ఉండేదా?
దాశరథి రాయకపోయి ఉంటే-
“ఒక రాజును గెలిపించడానికి తెగిపడ్డ కంఠాల” లెక్క తేలేదా?
“శ్రమజీవుల పచ్చి నెత్తురు తాగని ధనవంతుల” లెక్క తెలిసేదా?
“అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో?
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో?”
అని మనల్ను మనం ప్రశ్నించుకోవడానికి ఒక చరణం ఉండేదా?
“అణగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో?
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో?”
అని గుండెలు బాదుకోవడానికి ఆక్రోశగీతం ఉండేదా?
“పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో?
కుల మతాల సుడిగుండాలకు
బలిగాని పవిత్రులెందరో?
భరతావని బలపరాక్రమం
చెర వీడేదింకెన్నాళ్లకో?”
అని
గాయపడిన దాశరథి కవి గుండె రాయకపోయి ఉంటే…గాయపడిన కవుల గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో మనకు ఎప్పటికైనా లెక్క తెలిసేదా?
“మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తం ఎంతో?
రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో?
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో?
భూస్వాముల దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో?”
అన్న చరణం కూడా కలిపి ఈ పాటను కొందరు పాడుతున్నా…ఆయన 1977లో ప్రచురించిన పుస్తకం “దాశరథి కవిత- అగ్నిధార“లో ఈ చరణం లేదు. తరువాత ఆయనే చేర్చారో! లేక ఎవరైనా చేర్చి ఆయన ఖాతాలో వేశారో స్పష్టత లేదు.
కొస మెరుపు:-
పుస్తకంలో అన్ని పద్యాలు, గేయ కవితలు, వచన కవితలు, పాటలకు శీర్షిక పెట్టిన దాశరథి ఈ ఒక్క పాటకు శీర్షికే పెట్టలేదు. శీర్షికగా ప్రశ్న గుర్తు “?” పెట్టారెందుకో!
ఈ పుస్తకం అచ్చయ్యాక ఆయన స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి సంతకం చేసి ఇచ్చారు. కొంతకాలం తరువాత మర్రి చెన్నారెడ్డికి సన్నిహితుడైన దేవీ ఉపాసకుడు, జోస్యుడు జోషీ చేతికి వచ్చింది ఈ పుస్తకం. ఆయన తనకు మిత్రుడైన బ్యాంక్ మేనేజర్ సంజప్పకు ఇచ్చారు. నేను అప్పుడప్పుడు ఈ పాట పాడగా విన్న మిత్రుడు సంజప్ప భద్రంగా దాచుకున్న ఈ పుస్తకాన్ని నాకు బహుమతిగా తెచ్చి ఇచ్చారు. అలా దాశరథిగారు నా గ్రంథాలయంలోకి నలభై నాలుగేళ్లపాటు నడిచి వచ్చారు.
దాశరథి శతజయంతి సందర్భంగా రాస్తున్న వ్యాసాల ధారావాహికలో ఇది మొదటిది.
రేపు:-
“చల్లగాలినే పిల్లనగ్రోవిగా ఊదిన దాశరథి”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018