పరీక్షల తేదీలపై ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. పరీక్షలపై సుప్రీం కోర్టు తీర్పు ఇంకా అందలేదని, అందిన తరువాత తమ స్పందన చెబుతామని మంత్రి వెల్లడించారు. విద్యార్ధులకు పరీక్షలు ఎంత అవసరమో సుప్రీం కోర్టుకు తెలియయజేస్తామన్నారు.
కోవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. జూలై 26 నుంచి ఆగష్టు 2 వరకూ పది పరీక్షలు నిర్వహిస్తామని, ఈ విషయమై గురువారం నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు నిన్న వెల్లడించాయి. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్. జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్ట్ నోటీసులు ఇచ్చిన విషయం సమావేశంలో అధికారులు సిఎం దృష్టికి తీసుకు రావడంతో ఇవాళ దీనిపై నిర్ణయం తీసుకోనేదని తెలియవచ్చింది.