Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిలువ లేదు- వలువ లేదు

విలువ లేదు- వలువ లేదు

Toomuch of Freedom:
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం”

రెండు దశాబ్దాల క్రితం గాయం సినిమా కోసం సిరివెన్నెల రాసిన గేయం.. ఈ రెండు దశాబ్దాల్లో సమాజంలో ఏమన్నా మార్పు కనిపిస్తోందా? ఇంకా పతనమై పోయిందనిపిస్తోంది కదా! ఆటవికం నుంచి ఆధునికత వరకూ మనిషి ఎంతో దూరం వచ్చాడు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించానని సంబరపడుతున్నాడు. కానీ వాస్తవం వేరేగా ఉంది. అభివృద్ధి చాటున ఉన్న చీకటి కోణాలు ఎందరికి తెలుసు?

కాలం మారింది నిజమే! ఒకప్పుడు అమ్మాయిలకు ఎన్నో ఆంక్షలు. అబ్బాయిలు కూడా సిగరెట్ తాగడానికే తంటాలు పడేవారు. ఇప్పుడో ! ఇద్దరూ కలసి ఎడాపెడా ఊదేస్తున్నారు. ఇక తాగుడు చాలా తప్పు అనే కాలం నుంచి తెలియకుండానే తాగడం కల్చర్ అనే కాలానికి వచ్చేశాం. తాగడం, తూగడం నవీన నాగరికత.

పిల్లల్ని పెంచడం ఒక బాధ్యతగా, తపస్సుగా భావించే కాలం నుంచి వారు కోరింది ఇవ్వటమే తల్లిదండ్రుల బాధ్యత అనే రోజులకి వచ్చాం. ఇవ్వకపోతే పిల్లల చేతిలో మరణానికైనా సిద్ధంగా ఉండాలని వార్తలు చెప్తున్నాయి. (తాజాగా ఒక పిల్లవాడు పబ్జి గేమ్ వద్దన్నందుకు తల్లిని తుపాకీతో కాల్చేశాడు) ఇక ఎంత డబ్బుంటే పిల్లలు అంత పొగరుగా ఉంటారు. మరికొంతమంది డబ్బున్న తల్లిదండ్రులకి పిల్లలు ఎంత బయట తిరిగితే అంత సంతోషం. రాజకీయ కుటుంబాలైతే చెప్పక్కరలేదు. పిల్లాడు సిగరెట్ తాగినా, మందు కొట్టినా, ఎవరిని చావగొట్టినా ముద్దే. జేబునిండా డబ్బు, తిరగడానికి ప్రభుత్వ వాహనాలు, అమ్మానాన్నల పలుకుబడితో ఏ తప్పు చేసినా పర్లేదనే ధీమా వీరిచేత చెప్పరాని అఘాయిత్యాలు చేయిస్తోంది.

ఇంట్లో ఫోన్ ఉండటమే అరుదనే కాలం నుంచి అరచేతిలో ప్రపంచాన్ని చూపే సెల్ ఫోన్ కాలానికి చేరుకున్నాం. మన జీవితాలు ప్రపంచానికి చూపుతూ ఇంస్టాగ్రమ్, ఫేస్ బుక్కుల్లో బుక్ అవుతున్నాం( తాజాగా ఇంస్టా ద్వారా పదవతరగతి అబ్బాయి, అమ్మాయి పరిచయం అతడి స్నేహితులతో అమ్మాయిని అత్యాచారం చేయించే వరకు వెళ్ళింది)

ఒక అమ్మాయి,అబ్బాయి కలుసుకోవాలంటే ఎన్నో అడ్డంకులు, అడ్డుగోడలు ఉండే రోజులనుంచి పబ్బులు, క్లబ్బుల్లో కలిసి తిరిగే స్వేచ్ఛా జీవితాల్లోకి వచ్చాం. ఇక్కడ ఎవరి అనుమతులూ అవసరం లేదు. అడగకుండానే అన్ని అనుమతులూ వచ్చేస్తున్నాయి.
చదువులంటే పాఠాలు వినడం, పుస్తకాలు చదవడం నుంచి సినిమాలు, యూ ట్యూబ్ వీడియోలు అంటున్నాం. నైతిక విలువలు అంటే ఈ తరానికి అర్థం కాని మాట. ఒక్క విషయంలో మాత్రం తిరోగమిస్తున్నాం. ఆదిమానవుల కాలం నాటి వస్త్రధారణ మళ్ళీ వచ్చింది. శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాలు ఇప్పుడు శరీరాన్ని చూపడానికి వాడుతున్నారు.

ఇటువంటి సమాజంలో అన్ని వ్యవస్థలూ పనికిరాకుండా పోతే ఆశ్చర్యం ఏముంది? మరి సిగ్గే లేని ఈ సమాజాన్ని ఎంతగా నిగ్గదీసినా ఫలితం ఉంటుందా ? దేవుడే దిగి వచ్చినా మారుతుందా ఈ లోకం ?

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్