Saturday, January 18, 2025
HomeTrending Newsపార్టీల రాజకీయాలు - నేతల ఫిరాయింపులు

పార్టీల రాజకీయాలు – నేతల ఫిరాయింపులు

తెలంగాణలో రాజకీయాలు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను మించి పోయాయి. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. గెలుపు, అధికారమే పరమావధిగా నక్క జిత్తుల ఎత్తులు వేస్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసే వరకు ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో చెప్పలేని దుస్థితి నెలకొంది.

తెలంగాణలో ఎంపి సీట్ల కోసం టికెట్ల కేటాయింపులో పార్టీల అనైతికత తారాస్థాయికి చేరింది. టికెట్ల కోసం జనరల్ స్థానాల్లో పోటీ పడటం సహజం. అందుకు విరుద్దంగా తెలంగాణలో రిజర్వుడ్ స్థానాల కోసం నేతలు కండువాలు మార్చుకుంటే… పార్టీలు బరితెగించి చేర్చుకుంటున్నాయి. వరంగల్, నాగర్ కర్నూల్ ఎంపి టికెట్ల అంశం ఇందుకు ఉదాహరణ.

దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన నేతలకు మొండి చేయి చూపుతున్నారు. గోడ దూకి వచ్చిన వారికి, ఆర్థికంగా బలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. బహిరంగ సభల్లో నీతులు చెప్పే నేతలు… విపక్ష పార్టీలకు వెన్నుపోట్లు పొడిచేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయటం లేదు.

తెలంగాణలో దిగజారుడు రాజకీయాలకు ఆద్యుడు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అనే చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత బలం ఉన్నా.. కెసిఆర్ ఇతర పార్టీల నేతలను నయానో భయానో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా లేకుండా చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ ను తుదముట్టించే కుట్రలు చేశారు. ఆ రెండు పార్టీల ఉనికి ప్రశార్థకం చేసే దిశగా అసెంబ్లీ వేదికగానే టిడిపి, కాంగ్రెస్ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నారు.

ఇప్పుడు అదే రాజకీయాలు కాంగ్రెస్, బిజెపి చేస్తున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి ఒకడుగు ముందుకు వేసి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ వంద రోజులూ పాలన మీద దృష్టి పెట్టాను..ఇక నా రాజకీయం ఏంటో చూపిస్తా అని… ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపి రంజిత్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా ప్రకటించారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటంలో బిజెపి తక్కువేం లేదు. మోడీ పాలన చూడండి అని చెపుతూనే ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను చేర్చుకునేందుకు కిడ్నాప్ చేసినంత పని చేశారు. ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే కమలం నేతలు ఆచరణలో కాంగ్రెస్ ను తలదన్నే స్థాయిలో కుట్రలకు పాల్పడుతున్నారు.

బిజెపి తరపున ఎంపి టికెట్లు దక్కించుకున్న వారిలో మెజారిటీగా వలస నేతలే ఉన్నారు. వలస పక్షులను విజయలక్ష్మి కరుణిస్తుందా త్వరలోనే తేలనుంది. ఇప్పటికే అనేక మంది నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్, బిజెపి నేతలు విమర్శిస్తున్నట్టుగా కుటుంబంలోని నలుగురు నేతలే పార్టీలో మిగులుతారా లోక్ సభ ఎన్నికల తర్వాత మరింత స్పష్టత రానుంది.

బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే కాంగ్రెస్ చేసి.. వచ్చిన ప్రతి నాయకుడిని చేర్చుకొని పునరావాసం కల్పిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే ప్రజలు లెక్కలు కట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను ఈసడించుకున్నట్టే కాంగ్రెస్ కు పాతాళం అంచులను పరిచయం చేస్తారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్