శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత భారత రాష్ట్ర సమితికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణలో ఎదురు లేదనుకున్న కెసిఆర్ నాయకత్వానికి నేతల వలసలు సవాల్ విసురుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిట్టింగ్ ఎంపిలు( పెద్దపల్లి ఎంపి వెంకటేష్, నాగర్ కర్నూల్ ఎంపి రాములు, జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్) బిజెపి, కాంగ్రెస్ లో చేరటం పార్టీ నేతలను కలవరపరుస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు ప్రజల్లో అమితమైన గౌరవభావం ఉండేది. ఇతర పార్టీల నేతలను, ప్రజాప్రతినిధులను చేర్చుకునే సమయంలో పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తరచుగా ఒక వివరణ ఇచ్చేవారు. “తమది ఫక్తు రాజకీయ పార్టీ ఖచ్చితంగా రాజకీయాలు చేస్తాం ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటాం. తాము మడి కట్టుకొని లేమని ” ఖరాఖండిగా చెప్పేవారు.
ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్న నేతలు కెసిఆర్ పాలసీనే పాటిస్తున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేవారు. స్వచ్చందంగా వచ్చిన వారి కంటే నయానో భయానో వచ్చిన వారు అధికమని అప్పట్లో చెప్పుకునేవారు.
ఇప్పుడు వెళుతున్న వారిలో ఇతర పార్టీల నుంచి ప్రలోభాల కన్నా గులాబీ అగ్రనేతల వైఖరితో విసుగు చెంది వెళుతున్నారని టాక్ ఉంది. పంజరం నుంచి వచ్చిన పక్షుల్లా నచ్చిన రాజకీయ పార్టీలోకి వెళుతున్నారు. పార్టీ నేతలు ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు వస్తే ముఖ్య నేతలు సమయం ఇవ్వకపోవటం… పార్టీ అధినేతకు విన్నవించుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి.
ప్రగతి భవన్ గేటు దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ లేదని తిరిగి వెళ్ళినవారి అనుభవాలు కథలు కథలుగా పార్టీలో చెప్పుకుంటారు. పార్టీ నేతలు, ప్రజలకు సమయం ఇవ్వని నేతగా కెసిఆర్ పట్ల పజల వైఖరిలో ఇంకా మార్పు రాలేదు. పార్టీ నుంచి నేతల వలసలు వరదలా సాగుతున్నా ప్రజలు, మేధావుల నుంచి సానుకూల స్పందన రాకపోవటం గమనార్హం.
జారిపోతున్న నేతలను కాపాడుకోవటం బీఆర్ఎస్ అగ్రనేతల వల్ల కావటం లేదు. ఇంత జరుగుతున్నా పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేస్తున్నారు. తెలంగా ఉద్యమ సమయంలో ఇంతకన్నా ఎక్కువమంది పార్టీని వీడారని.. ఫిరాయింపులతో పార్టీకి వచ్చిన నష్టం లేదని అంటున్నారు. ఉద్యమ పార్టీగా అప్పుడు గులాబీ దండుకు వెన్నుదన్నుగా ఉద్యమకారులు, ప్రజలు, మేధావులు ఉండేవారు.
పదేళ్ళ పాలనలో తెలంగాణలో అభివృద్ధి ఎంత జరిగిందో… దోపిడీ అంతకన్నా రెట్టింపు జరిగిందనే భావం ప్రజల్లో నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కోలుకోవటం సాధ్యం అయ్యేలా లేదు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో… శాసనసభ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని నివేదికలు వస్తున్నాయి.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు లోపాయికారిగా బిజెపికి సహకరించటం మినహా బీఆర్ఎస్ కు మరో మార్గం లేదు. ఈ అంశం ఓటరు పసిగడితే కారు శాశ్వతంగా షెడ్డుకు వెళుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
-దేశవేని భాస్కర్