నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం అన్నారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
సినీ నటుడు మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
జూబ్లీహిల్స్ లోని నివాసంలో కైకాల సత్యనారాయణ మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి KCR ఆదేశించారని తెలిపారు. మూడు తరాల పాటు అనేక చిత్రాలలో వివిధ పాత్రలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, సత్యనారాయణ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కు తీరని లోటు అని మంత్రి తలసాని అన్నారు.