Sunday, January 19, 2025
HomeTrending Newsదేశానికి అభివృద్ధి నమూన తెలంగాణ

దేశానికి అభివృద్ధి నమూన తెలంగాణ

Development Model For The Country Is Telangana :

పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్‌ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి దేశవ్యాపితంగా చర్చ జరుగుతుందని, ఆయన ఆలోచనల ధారల్లో దేశానికే నూతన ప్రణాళిక రచించుకునే సమయం అసన్నమైందని అన్నారు. కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ రాసిన “కేసీఆర్‌ ది మ్యాన్‌ ఆఫ్‌ మిలియన్స్‌” అన్న పుస్తకాన్ని బుధవారం నాడు మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో కొత్త అభివృద్ధి నమూనా తీసుకురావాలని గత 60 ఏళ్ల పాలనకు భిన్నంగా అభివృద్ధి నమూనా భారత్‌ను నిర్మించే లక్ష్యంతో కేసీఆర్‌ ముందుకు సాగుతున్న సమయంలో ఈ పుస్తకం రావటం అభినందనీయమన్నారు. ఇది ఉద్యమకారులకు దారిదీపం లాంటిదని చెప్పారు.

దేశంలో అపరిష్కృత సమస్యలకు కేసీఆర్‌ కొత్త అజెండా రచిస్తున్న సందర్భంలో పాలనాదక్షుడైన కేసీఆర్‌ సమర్థతను చాటి చెప్పటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో లక్షలాది మందిలో లక్షల ఆలోచనలను కేసీఆర్‌ ఏ విధంగా రేకెత్తించగలిగారో వాటినన్నింటిని గౌరీశంకర్‌ ఈ పుస్తకంలో పొందుపరిచారని చెప్పారు. అంతర్జాతీయ కవులు, రచయితలు ఈ పుస్తకానికి ముందుమాటలు రాయటం వల్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచవ్యాప్త అస్తిత్వ ఉద్యమాలకు పాఠంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఏం జరిగింది? రాష్ట్ర సాధన ఉద్యమం ఎట్లా కొనసాగింది? ఎన్నెన్ని ఆటుపోట్లను ఎదుర్కోవలసి వచ్చింది? చిక్కుముడులను విప్పుకుంటూ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలను ఎట్లా చేరుకోగలిగారో ఈ పుస్తకంలో లిఖించటం జరిగిందని వివరించారు. తెలుగులో జూలూరు గౌరీశంకర్‌ రాసిన “దటీజ్‌ కేసీఆర్‌” పుస్తకాన్ని ఆంగ్ల అనువాదకుడు మంతెన దామోదరాచారి “కేసీఆర్‌ ది మ్యాన్‌ ఆఫ్‌ మిలియన్స్‌” పేరుతో ఆంగ్లంలోకి అద్భుతంగా అనువదించారని తెలిపారు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అధ్యక్షత వహించగా శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సమాచార శాఖ ముఖ్య కమిషనర్‌ బుద్ధా మురళి, కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తొలి చైర్మన్‌ ఘంటా చక్రపాణి, తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, కమిషన్‌ సభ్యులు కిషోర్‌గౌడ్‌, శుభప్రద పటేల్‌, ఉపేంద్ర, రామానందతీర్థ గ్రామీణ విద్యా శిక్షణా సంస్థ డైరెక్టర్‌ డా. ఎన్‌. కిషోర్‌, రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం డైరెక్టర్‌ డా. బండి సాయన్న, రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్‌ ఎం.డి. నామోజు బాలాచారి, పుస్తక ఆంగ్లానువాదకుడు మంతెన దామోధరాచారి, రాజకీయ సామాజిక విశ్లేషకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సామా భరత్‌కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాజసింగ్ వ్యాఖ్యలపై కేటిఆర్ విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్