Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జూరాల ఎలా మర్చిపోయారు: దేవినేని

జూరాల ఎలా మర్చిపోయారు: దేవినేని

జూరాల ప్రాజెక్టును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురాకుండా రాయలసీమ రైతుల గొంతు కోస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమా విమర్శించారు. కృష్ణా జలాలు ఏపీలోకి రావడానికి గేట్ వే గా జూరాల ఉంటుందని అలాంటి ప్రాజెక్టును, దాని పరిధిలో ఉండే రిజర్వాయర్లను కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకు రాకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. దీని ద్వారా 150 టిఎంసిల నీటి హక్కులను పక్క రాష్ట్రానికి ధారాదత్తం చేసినట్లు అవుతుందని హెచ్చరించారు.

మన రాష్ట్రం చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, మచ్చుమర్రి, గండికోట రిజర్వాయర్, సోమశిల, కందలేరు, వెలిగొండ ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి అప్పజెప్పిన సిఎం జగన్ జూరాల ఎలా మర్చిపోయారని, నిన్న జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ అధికారులు ఎలా సంతకం పెట్టి వస్తారని, తెలంగాణా ప్రభుత్వ పెద్దలతో కుదిరిన లాలూచీ ఏమిటని నిలదీశారు. జగన్ చర్యలతో రాబోయే రోజుల్లో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు చుక్క నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర రైతాంగం హక్కులు, ప్రయోజనాలను తెలంగాణకు  తాకట్టు పెట్టే హక్కు  సిఎం జగనకు ఎవరిచ్చారని దేవినేని సూటిగా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో సహకరించారని, డబ్బులు సమకూర్చారని వారి మెప్పుకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం దారుణమని దేవినేని విస్మయం వ్యక్తం చేశారు.

గతంలో జగన్ తండ్రి వైఎస్ మిగులు జలాలపై హక్కులు అడగబోనని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ ఇచ్చారని, ఇప్పుడు జగన్ రాష్ట్ర నీటి హక్కులపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఉమా మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్