Saturday, September 21, 2024
HomeTrending Newsటిడిపిలో దేవినేని ఉమకు గడ్డుకాలం

టిడిపిలో దేవినేని ఉమకు గడ్డుకాలం

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరటం దాదాపు ఖాయం అయింది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. టికెట్ పై లోకేష్ హామీ ఇవ్వటంతో సైకిల్ తో సవారీ చేసేందుకు వసంత పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వసంత రాకతో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు పాలుపోవటం లేదు. తన భవిష్యత్తు ఎంటనే సందిగ్ధంలో పడ్డారు.

చంద్రబాబు మంత్రి వర్గంలో కీలకమైన నీటిపారుదల శాఖ చూసిన ఉమా అంతకు ముందు పదేళ్ళు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా…పార్టీలో ఏకచాత్రాదిపత్యంగా ఏలుకున్నారు. మంత్రిగా ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమ…తను చెప్పిందే వేదం అన్నట్టుగా నడిపించారు. తనకు ఎదురు లేదన్నట్టుగా ఒంటెత్తు పోకడలకు పోయారని.. ఉమ పోరు భరించలేకనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని వీడారు. జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి ఉమ చిటపట మాటలు ఎలా ఉంటాయో వివరించాల్సిన అవసరం లేదు.

ఎంపిగా కేశినేని నాని గెలిచినా నాటి నుంచి ఇద్దరు నేతలు ఉప్పు నిప్పుగానే ఉన్నారు. ఉమా వ్యవహార శైలిని మొదటి నుంచి నాని ఈసడించుకునేవారు.  రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దె భవనాల వేటలో ఉమ చేతి వాటం అంతా ఇంత కాదని ఆరోపణలు ఉన్నాయి. ఒక రూపాయి SFT చొప్పున అద్దె ఉండే ప్రాంతానికి మూడు రూపాయల చొప్పున అద్దె అగ్రిమెంట్లు చేయించి ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టారని… అప్పట్లో ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఇలా పార్టీలో వన్ మాన్ షో చేసిన ఉమను ఇప్పుడు పలకరించే వారు లేరు.

లోకేష్ తన ముందర బచ్చా అన్నట్టుగా ఉమా వ్యవహరిస్తారని…దీంతో సమయం ఆసన్నమైంది  ప్రతీకారం తీర్చుకునేందుకు అన్నట్టుగా ఇప్పుడు లోకేష్ కూడా దూరం పెడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. టిడిపిలో స్కోప్ లేకపోవటంతో ఇతర పార్టీల వైపు ఉమా దృష్టి సారించారని.. ఈ దిశగా ఇప్పటికే మంతనాలు సాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం.

వైసిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లాలో టాక్ మొదలైంది. జిల్లా వైసిపి నేతలు మూకుమ్మడిగా వ్యతిరేకించారని… ఉమ ప్రయత్నాలపై నీళ్ళు చల్లారని వినికిడి. జనసేనలోకి వెళ్లేందుకు ఆస్కారం లేదు. ఇక మిగిలింది బిజెపి మాత్రమే. ఎలాగు ఆ పార్టీకి అభ్యర్థుల కరువు ఉంది కనుక దేవినేని కోరుకున్న చోట టికెట్ దక్కుతుంది.

బిజెపి టికెట్ మీద మైలవరంలో పోటీ చేసి సత్తా చాటాలని మాజీ మంత్రి ప్రణాళిక తయారు చేస్తున్నారని అనుచరులు అంటున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ను ఓడించి తెలుగుదేశం పార్టీకి గుణపాటం చెపుతామని ఉమా అనుచరులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిన దేవినేని ఉమ ఏ మేరకు ప్రభావం చూపగలరో ప్రశ్నార్థకంగా మారింది.

బిజెపి నుంచి దేవినేని ఉమ – టిడిపి నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తే వైసిపి గెలుపు నల్లేరు మీద నడకే అని విశ్లేషణ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్