ఒకప్పుడు భక్తి చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. ఆలయాలు .. భగవంతుడి మహిమలకు సంబంధించిన కథలకు విశేషమైన ఆదరణ లభించింది. భక్తి ప్రధానమైన తెలుగు సినిమాలు మాత్రమే కాదు, తమిళ సినిమాల అనువాదాలను కూడా అప్పట్లో విపరీతంగా చూశారు. ఆ తరువాత భక్తి చిత్రాల జోరు తగ్గుతూ వచ్చింది. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. యాక్షన్ తో కూడిన కథలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. తమిళం వైపు నుంచి కూడా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ రావడం తగ్గిపోయింది.
అయితే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి వచ్చేసరికి, భగవంతుడి నేపథ్యంలో మహిమలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక మార్గం ఏర్పడింది. కథాకథనాలకు తగిన అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయగల అవకాశం లభించింది. దాంతో అప్పటి నుంచి మళ్లీ దైవ సంబంధమైన కథలపై మేకర్స్ దృష్టి పెట్టారు. ఒక గ్రామం .. అక్కడి ఆలయం .. ఆలయంలోని స్వామివారి పట్ల అక్కడి ప్రజలకున్న విశ్వాసం నేపథ్యంలో కథలు రావడం మొదలైంది. అలా వచ్చిన ‘కార్తికేయ’ .. ‘కార్తికేయ 2’ భారీ విజయాలను అందుకున్నాయి.
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణం, హీరోకి దైవశక్తి కూడా తోడు కావడమే. ఇలా హీరోయిజానికి దైవశక్తిని యాడ్ చేస్తూ కథను నడిపించే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు అదే తరహా కాన్సెప్ట్ తో ‘సుబ్రమణ్య’ అనే మరో సినిమా రూపొందుతోంది. తిరుమల రెడ్డి – అనిల్ కడియాల నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.