Mini Review: ధనుశ్ తాజా చిత్రంగా ఈ నెల 12వ తేదీన తమిళంలో విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ .. నిన్న తెలుగులో థియేటర్లకు వచ్చింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, బ్రిటీష్ పరిపాలనా కాలంలో నడుస్తుంది. పోలీస్ గా .. దొంగగా .. తిరుగుబాటు దారుడిగా ఈ సినిమాలో ధనుశ్ కనిపిస్తాడు. భారతీయులపై .. ముఖ్యంగా తన గూడెం ప్రజలను ఇబ్బంది పెడుతున్న బ్రిటీష్ గవర్నర్ జనరల్ పై హీరో తిరుగుబాటు జెండా ఎగరేస్తాడు.
ఈ క్రమంలోనే హీరోకి .. బ్రిటీష్ సైన్యానికి మధ్య పోరాటడం నడుస్తూ ఉంటుంది. వాళ్ల దగ్గర నుంచి ఆయుధాలను కాజేసి వాటితోనే హీరో తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అతణ్ణి అణచేయడమో .. అంతం చేయడమో అనేదే పనిగా పెట్టుకుని గవర్నర్ జనరల్ రంగంలోకి దిగుతాడు. అతని ఆచూకీ చెప్పమని గిరిజన ప్రజలను హింసిస్తూ ఉంటాడు. తనవాళ్ల బాధలను చూడలేకపోయిన ‘మిల్లర్’ నేరుగా బరిలోకి దిగుతాడు. ఇలా ఈ సినిమా యాక్షన్ మోడ్ లోనే ఎక్కువగా నడుస్తుంది.
ఈ సినిమాలో శివరాజ్ కుమార్ .. జయప్రకాశ్ .. సందీప్ కిషన్ కూడా ఉన్నారు. బ్రిటీష్ అధికారిగా చేసిన అతను విలన్. కానీ అది అంత పవర్ఫుల్ గా అనిపించదు. శివరాజ్ కుమార్ పాత్ర అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటుంది. సందీప్ కిషన్ పాత్ర చుట్టపు చూపుగా వచ్చి వెళుతుంది. ప్రియాంక అరుళ్ మోహన్ తో హీరో లవ్వు ఉంటుందని అనుకుంటే అక్కడా కూడా ఆడియన్స్ కి నిరాశనే ఎదురవుతుంది. ఆమె వేరొకరితో వెళ్లిపోవడానికి హీరోనే సాయం చేయడం ఒక ఎత్తయితే, ఆ తరువాత ఆమెను విడోగా చూపించడం మరో ఎత్తు. ఇలా ధనుశ్ పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ తేలిపోవడమే మైనస్ మార్కులను తెచ్చిపెడుతుంది.