వైజాగ్ కు పరిపాలనా రాజధాని వస్తే రణస్థలం వరకూ కార్యాలయాలు వస్తాయని, పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రాంత హక్కు అని, దాన్ని లాక్కోకుండా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు పిలుపు ఇచ్చారు. తన త ప్రజల మేలు చేసే అవకాశం వచ్చినప్పుడు మంత్రి పదవి పెద్దది కాదని, సీఎం జగన్ ను కూడా కలిసి ఇదే చెప్పానని, అయితే వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నట్లు సిఎం స్పష్టంగా చెప్పారని ధర్మాన వెల్లడించారు. విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక నేతృత్వంలో శ్రీకాకుళం సన్ రైజ్ హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో మంత్రి ధర్మాన పాల్గొని మరోసారి తన అభిప్రాయాన్ని తేల్చిచెప్పారు. “ఈ రాష్ట్రంలో చాలా భిన్నమయిన అభిప్రాయాలు ఉన్నాయి. మాకు అన్యాయం జరిగింది అని చెప్పేవాళ్లు.. ఈ రాష్ట్రంలో మేం వెనుకబడిపోయాం అని చెప్పేవాళ్లు ఉన్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖ మన రాజధాని అని గొంతుక వినిపించకపోతే మళ్లీ మేం వెనకబడిపోతాం అన్న భయం అయితే ఉంది” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ విధంగా చూసుకున్నా క్లోజ్డ్ డెవలప్మెంట్ మోడల్ కు ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా లేవని, కనుక మూడు రాజధానుల ప్రతిపాదన అన్నది తెరపైకి వచ్చిందని చెప్పారు. తనకు అమరావతి రైతులంటే కోపం లేదని, వారిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ మాఫియా నిర్వహించడం సబబు కాదని సూచించారు. చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నారని, ఇన్నాళ్లుగా మనం సాధించుకోలేకపోయింది ఇప్పుడు సాధించుకోవాల్సిన తరుణం రానే వచ్చిందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు రాజధానికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు మనకు చేరువలోనే రాజధాని ఏర్పాటు కానుందని, అంటే మనకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి కాబట్టి ఈ విషయమై అంతా ఏకమై పోరాడాల్సి ఉందని ఉత్తరాధ్ర ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం సీఎం జగన్ దేనికైనా తెగిస్తారని, అమరావతి విషయంలో జరిగిన దారుణాలను అవగాహన చేసుకున్న తరువాత సిఎం తీసుకున్న పరిపాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
సాధిద్దాం సాధిద్దాం విశాఖ రాజధాని సాధిద్దాం..
కొట్టొద్దు.. కొట్టొద్దు..మా కడుపులు కొట్టొద్దు..
మోసపోయాం.. మేము ఇంకా మోసపోము
మా గొంతు కోస్తామంటే కోటి గొంతులు గర్జిస్తాయి
అందరం బాగుందాం అందులో మనం ఉందాం… అని ధర్మాన నినదించారు.
Also Read : విశాఖ రాజధాని వద్దనే హక్కు లేదు: ధర్మాన