మహేంద్రసింగ్ మాయాజాలం

Rare Piece: క్రికెట్ ఐ పి ఎల్ 2023 కప్పును గెలుచుకున్న తరువాత చెన్నయ్ సూపర్ కింగ్స్ సారథి ధోనీ వ్యక్తిత్వం మీద మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా.

1. ఐ పి ఎల్ ఫైనల్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ను వికెట్ కీపర్ గా ధోనీ అవుట్ చేసిన మెరుపు వేగం;
2. మ్యాచ్ గెలిచాక కప్పును అందుకోవాల్సిందిగా తనను పిలిస్తే…తను వెళ్లకుండా…తన జట్టులో క్రీడాకారులు జడేజా, అంబటి రాయుడిని ముందుకు తోసి…తను పక్కన ఉండిపోవడం;


3. రిటైర్ కావడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు అంటూ…అభిమానుల ప్రేమ ఉక్కిరి బిక్కిరి చేస్తుండడం వల్ల ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ ప్రకటించలేకపోతున్నానని చెప్పడం…

ఈ మూడు సందర్భాల వీడియో చూసినా…వార్త చదివినా మనసంతా ఆనందంతో నిండిపోతుంది.

వ్యక్తిగతంగా ధోనీ సూర్యకుమార్ లా, శుభ్ మన్ గిల్ లా మెరుపులు సృష్టించకపోయినా…బృందాన్ని నడిపే నాయకుడిగా ధోనీ ప్రత్యేకత ఈ సీజన్ అంతా అడుగడుగునా కనిపిస్తుంది. ఎవరిలో ఏ సత్తా ఉందో? పసిగట్టి వారిని తురుపు ముక్కలుగా వాడుకోవడంలో ధోనీ చూపిన నాయకత్వ లక్షణం క్రీడా మైదానం దాటి…బయట ప్రపంచం నేర్చుకోదగ్గది.

సాధారణ, గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి…బాంబే కోటలను బద్దలు కొట్టిన ధోనీలో దేశం బహుశా తనను తాను చూసుకున్నట్లుంది. లేదా దేశం తన నుండి ఏమి కోరుకుంటుందో దానికి అనుగుణంగా ధోనీ తనను తాను మలచుకున్నట్లున్నాడు.

ధోనీ కూడా విమర్శలకు అతీతుడేమి కాదు. ఆ విషయం ఇక్కడ అనవసరం.

పెద్ద పెద్ద లక్ష్యాలకు పెద్దగా అరచి గీ పెట్టాల్సిన పనిలేదు. హడావుడి పడాల్సిన పనిలేదు. ఇటుక ఇటుక పేర్చుకుంటూ నెమ్మదిగా ఎలా పెద్ద లక్ష్యాన్ని ఛేదించవచ్చో ధోనీని చూసి నేర్చుకోవచ్చు.

సెకెనులో వెయ్యో వంతు సమయంలో మెదడు, శరీరం మెరుపు వేగంతో ఎలా పని చేయాలో? ఎందుకు పని చేయాలో? తెలియాలంటే ధోనీని చూడాలి.

ధోనీ వయసయిపోతోందని మనం అనుకుంటున్న ప్రతిసారీ…ధోనీ ఇంకా ఉండాలని మనమే డిమాండు చేసేలా మాయ చేస్తాడు ధోనీ.

గెలిచిన కప్పును జడేజా- అంబటి రాయుడు పట్టుకున్నా…అది ధోనీ చేతుల్లోనే మనకు కనిపిస్తుంది. విజయగర్వంతో ధోనీ ఎగరకపోయినా…ఆ మౌనంలో, నిలకడలో, పెదవి మీద చిరు నవ్వులో విజయం మనకు కనిపిస్తుంది.

ఆటను జీవితానికి అన్వయించుకోవాలనుకునే వారికి ధోనీ ఒక జీవన పాఠం. ఎంతటి హిమాలయమంత ఎత్తునయినా చిత్తు చేయడానికి మైండ్ గేమ్ ముఖ్యం. ఎక్కడయినా అలాంటి మైండ్ గేమ్ ఎందుకు అవసరమో తెలియాలంటే ధోనీ మైండ్ ను మనం అధ్యయనం చేస్తూనే ఉండాలి. ధోనీని ఆరాధిస్తూనే ఉండాలి.

ఎందుకంటే…
చూసి…నేర్చుకోవాలనుకుంటే…
ధోనీ మనకేదో ఒక మంచి లక్షణం నేర్పకపోడు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *