People suffering: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రమైన నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్నారని టిడిపి సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర విమర్శించారు. ఆయనేదో అద్భుతాలు చేస్తుంటే తాము అడ్డుపడుతున్నట్లు మాట్లాడడం దారుణమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేవలం అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిపై ప్రశ్నిస్తుంటే ఇప్పుడు తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, జీతాల విషయంలో మోసం చేసిన ఘనత జగన్ దేనన్నారు.
జగన్ ను చూసి తాము ఎందుకు ఏడవాలని… పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చినందుకా? కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసినందుకా? అని ప్రశ్నించారు. ఓట్లేసిన ప్రజలు జగన్ పాలన చూసి నిజంగానే ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. అంబానీ కంపెనీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల భారం పెరుగుతుందని అధికారులు చెప్పినా వినకుండా ముందుకెళ్ళారని గుర్తు చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే తామంతా ఆయనకు మారీచుల్లాగా కనబడుతున్నామా అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో సైద్ధాంతిక పోరాటాలే ఉంటాయి తప్ప వ్యక్తిగత పోరాటాలు ఉండవని, కానీ వ్యక్తిగత సాధింపులు జగన్ సిఎం అయిన తర్వాతే మొదలయ్యాయని ధూళిపాల అన్నారు. పాలనాపరమైన వైఫల్యావల్లే శ్రీలంక ఈ స్థాయికి చేరుకుందని, ఇక్కడ కూడా అవే పరిస్థితులు ఉన్నాయని విశ్లేషించారు. తమ వైఫల్యాలకు విపక్షాలను బాధ్యులను చేసే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామన్నారు.
Also Read : ప్రజల అండ ఉన్నంతవరకూ ఏమీ చేయలేరు