Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅవార్డులకు గులాం

అవార్డులకు గులాం

Political Awards: విశాల వక్షస్థలంతో గుండె నిబ్బరానికి మారు పేరైన భారత ప్రధాని నిండు సభలో కాశ్మీరీ గులాం నబీ ఆజాద్ కు విడ్కోలుగా కంట తడి పెట్టుకున్నప్పుడే కాంగ్రెస్ కు అర్థమై ఉండాలి. సభలో గులాంను మోడీ ఆకాశానికెత్తినప్పుడే కాంగ్రెస్ కు అర్థమై ఉండాలి.

పాతతరం పి వి, వాజపేయి తరహా కాదు మోడీ. ప్రతి కదలికలో ఒక ఎత్తుగడ ఉంటుంది. ప్రతి మాటకు ఒక గురి ఉంటుంది. బిట్వీన్ ది లైన్స్ లక్ష్య సాధన వ్యూహం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే వందకు పైగా పద్మాల్లో ఒక పద్మాన్ని గులాం నబీకి ఇవ్వడంతో మోడీకి వచ్చే నష్టమేమీ ఉండదు…లాభమే తప్ప. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంతో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఒక ముస్లిం నాయకుడిని మోడీ గౌరవించారని పేరు వస్తుంది. అయితే ఈ గుర్తింపు ఇప్పుడు మోడీకి అంత ముఖ్యం కాదు.

గులాంను గౌరవించడం ద్వారా ఆయన కాంగ్రెస్ ను అవమానించాలనుకున్నారు. కాంగ్రెస్ ఆయన వ్యూహంలో చిక్కుకుని ఆయన కోరుకున్నట్లే చేసి నవ్వులపాలవుతోంది. ఇందులో కాంగ్రెస్ అధినాయకులు సోనియా, రాహుల్, ప్రియాంకల పాత్ర ఉండకపోవచ్చు కానీ…సున్నితమయిన విషయాలు రాజుకోకముందే జాగ్రత్తపడాలి.

గులాంకు అవార్డు ప్రకటించిన వెంటనే సంతోషం…గులాంకు అభినందనలు…అని ఒక ప్రకటనను కాంగ్రెస్ అధికారికంగా విడుదల చేసి ఉంటే మోడీ వ్యూహానికి కాంగ్రెస్ ప్రతి వ్యూహంగా ఉండేది. అలా చేస్తే కాంగ్రెస్ ఎందుకవుతుంది?

గులాంకు అవార్డు ఇవ్వడం మంచిది అనేవారిని కాంగ్రెస్ ఆపలేదు. అవార్డును గులాం తిరస్కరించాలి అని డిమాండ్ చేసేవారిని కాంగ్రెస్ నియంత్రించలేదు. చూసే వారికి గులాం కాంగ్రెస్ వ్యక్తి అవునో కాదో తెలియని అయోమయం ఏర్పడాలి. పాడు కాంగ్రెస్…తన సొంత ఇంట్లో మనిషికి అత్యున్నత పురస్కారం వస్తే కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది…అని అసహ్యం పుట్టాలి. టీ కప్పులో తుఫానులకు కాంగ్రెస్ నిలువెల్లా వణికి పోతూ ఉండాలి.

ఎక్కడయినా ప్రతిపక్షాన్ని చూసి అధికార పక్షం భయపడుతూ ఉంటుంది. కాంగ్రెస్ ప్రతి పక్షంలో ఉంటే తనను చూసి తానే భయపడుతూ ఉంటుంది. మోడీకి కావాల్సింది అదే. అందుకోసం గులాంకు ఒక్క పద్మ ఏమిటి ఖర్మ? వంద పద్మాలనయినా ఇచ్చేస్తారు. ఆ పద్మాల్లో ఒక్కో రేకు బాకుగా కాంగ్రెస్ కు గుచ్చుకుంటూ ఉంటే…బి జె పి కొలనులో మరిన్ని పద్మాలు గులాముల మెడలో హారం కావడానికి మొగ్గ విచ్చుకుంటూ ఉంటాయి.

ఒక పద్మం ఒకరికి పురస్కారం.
అదే పద్మం ఒకరికి అవమానం.

రాముడు గడ్డిపోచను అభిమంత్రిస్తే బ్రహ్మాస్త్రమయ్యింది.
నేడు పద్మాన్ని అభిమంత్రిస్తే బ్రహ్మాస్త్రమయ్యింది.

దేన్నయినా వాడుకోవడం తెలియాలి. దానికి పద్మ వ్యూహాలు, పద్మ పురాణాలు చదవాల్సిన పనిలేదు. లౌకిక జ్ఞానం ఉంటే చాలు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఏది భక్తి? ఏది కాదు?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్