రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానాతో మూవీ చేయనున్నారు. అయితే.. చరణ్ ఓ భారీ మల్టీస్టారర్ చేయడానికి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ మల్టీస్టారర్ ఎవరోతోనే కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి చేయనున్నారట. అయితే.. చరణ్ – సూర్య కాంబోలో మూవీని ప్లాన్ చేస్తుంది దిల్ రాజు అని సమాచారం. దిల్ రాజు ప్రస్తుతం చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా చేస్తున్న టైమ్ లోనే దిల్ రాజుకు టాలీవుడ్ హీరో, కోలీవుడ్ హీరో కాంబోలో పాన్ ఇండియా మూవీ చేయాలనే ఆలోచన వచ్చిందట. ఈ భారీ మల్టీస్టారర్ ఆలోచన గురించి దర్శకుడు శైలేష్ కొలనుకు చెబితే.. తన దగ్గర కథ ఉందని ఓ థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. ఈ కథ దిల్ రాజుకు నచ్చిందట. ఈ భారీ పాన్ ఇండియా మూవీని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చరణ్, సూర్య వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
శైలేష్ కొలను రెడీ చేసిన స్టోరీ ఈ ఇద్దరు హీరోలు విని ఓకే అంటే.. వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. శైలేష్ కొలను ప్రస్తుతం వెంకటేష్ తో సైంథవ్ మూవీ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సైంథవ్ మూవీని విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత శైలేష్.. ఈ భారీ మల్టీస్టారర్ స్టోరీ పై వర్క్ చేస్తాడట. మరి.. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందేమో చూడాలి.