No negligence : రేపల్లె రైల్వే స్టేషన్ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి 6 గంటల్లోపే వారిని అదుపులోకి తీసుకున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించారు. రాత్రి ఒంటిగంటకు ఫిర్యాదు వస్తే ఉదయం 7 గంటల్లోపే వారిని పోలీసులు అరెస్టు చేశారని, పోలీసులు చాలా వేగంగా స్పందించారని చెప్పారు. నిందితులపై పకడ్బందీగా కేసులు నమోదు చేశామని… 376 (డి) ప్రకారం గ్యాంగ్‌రేప్, బాధితురాలి భర్త దగ్గర డబ్బు దోచుకున్నారు కాబట్టి జీ–94 సెక్షన్, ఆమె భర్తపై దాడి చేశారు కాబట్టి సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశామని వివరించారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ లతో కలిసి పరామర్శించిన అనంతరం వనిత మీడియాతో మాట్లాడారు.
బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించామని, ఆమె 7 నెలల గర్భిణి కావడంతో, అనుకోని దుర్ఘటనతో ఆమె ఇబ్బంది పడుతోందని, నిన్ననే ఆమెకు రూ.2 లక్షల సహాయం చేశామని, అన్ని విధాలుగా ఆమెను ఆదుకుంటామని చెప్పారు. నిందితుల్లో ఇద్దరు ఎస్సీ, మరొకరు యాదవ కులస్తుడని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగింది రైల్వే స్టేషన్‌లో కాబట్టి అక్కడ భద్రత బాధ్యత రైల్వే పోలీసులదని, అయినప్పటికీ రాష్ట్ర పోలీసులు చాలా వేగంగా స్పందించి, బాధితురాలిని కాపాడారని చెప్పారు.
ఇటీవల జరిగితున్న దాడులన్నీ కూడా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిపైనే జరుగుతున్నాయని, విజయవాడలో అత్యాచారానికి గురైన బాలిక, మానసిక దివ్యాంగురాలు కాగా, ఈ మహిళ దళితురాలని వనిత ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లె ఘటనకు పాల్పడింది పాత నేరస్తులే కాబట్టి ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని చోట్లా పాత నేరస్తులపై దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నామని చెప్పారు.
ఇలాంటి దుర్ఘటనల్లో దర్యాప్తు, విచారణ చాలా వేగంగా జరిగి, నిందితులకు శిక్ష పడే విధంగా దిశ చట్టం రూపొందించామని, దిశ అమలు కాకపోవడం వల్ల శిక్ష అమలు ఆలస్యమవుతోందని వనిత అన్నారు. కేంద్రం క్లియరెన్స్ రాకపోవడంతో, చట్టం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోందని, కానీ పలు ఘటనల్లో ఆ పార్టీ వారే బాధ్యులుగా తేలుతున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : బాధ్యతగా ప్రవర్తించాలి: మంత్రి సురేష్