పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ రోజుతో పాటు అనంతరం జరుగుతోన్న హింసాత్మక సంఘటనల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
రౌడీమూకలు, ప్రైవేటు సైన్యం దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది. పారామిలటరీ బలగాలను పల్నాడుకు తరలించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు, రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 800 మంది అదనపు బలగాలను మాచర్ల నియోజకవర్గానికి పంపారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.