Saturday, November 23, 2024
HomeTrending NewsFree Power: రైతాంగాన్ని చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ దే - బీఆర్ఎస్

Free Power: రైతాంగాన్ని చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ దే – బీఆర్ఎస్

కరంట్ షాక్ తో కాంగ్రెస్ విలవిలలాడుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. కరంటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయంగా, రాష్ట్రాల వారిగా ఒక విధానం అంటూ ఉన్నదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, పైలట్ రోహిత్ రెడ్డి, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తప్పులు మాట్లాడి సరిదిద్దుకోకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణను ముందుకు తీసుకుపోవడంలో ఒక దార్శనికత ఉన్నదా ? ఒక ఆలోచన ఉన్నదా ? పార్టీలో మనిషికో మాట మాట్లాడతారు. అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఆలోచించలేదు.. దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ పాలన. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది విద్రోహ పాత్ర. తెలంగాణ ఇచ్చామని చెప్పడంలోనే కాంగ్రెస్ అహంకారం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రజల హక్కు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలన్నా ఢిల్లీలో స్విచ్ నొక్కాలి .. బీఆర్ఎస్ పార్టీ ఆత్మ తెలంగాణ రాష్ట్రం. స్పష్టమయిన ప్రణాళికతో తెలంగాణ వ్యవసాయం లాభదాయకం చేసేందుకు ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. పొరపాటున కాంగ్రెస్ కు అవకాశం దక్కితే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుంది .. తెలంగాణ పూర్వపు స్థితికి వెళ్తుంది.

మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు

రైతులకు 24 గంటల ఉచిత కరంటు విషయంలో చర్చ ఎందుకు తెచ్చారు ? ఎవరు తెచ్చారు ? వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు, ఇండ్లకు 24 గంటల కరంటు ఉండొచ్చు .. మరి రైతాంగానికి కరంటు సరఫరా విషయంలో ఎందుకు చర్చ ? రైతాంగం, ప్రజలు ఈ విషయంలో ఆలోచించి వారి కుట్రలను అర్ధం చేసుకోవాలి. తొందరపాటుతో చంద్రబాబును బయటపడేసిన వ్యక్తి నేడు కరంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతరంగాన్ని బయటపెట్టాడు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కరంటు కోసం ఎన్ని ధర్నాలు, ఎన్ని రాస్తారాకోలు ప్రజలకు తెలియదా ? ఏకంగా పారిశ్రామికవేత్తలే ధర్నా చేశారు. రైతాంగాన్ని చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే .. పారిశ్రామికవేత్తలే పారీపోయేలా చేసిన పేటెంట్ మీదే .. అవినీతితో చరిత్ర మూటగట్టుకున్న పేటెంట్ మీదే. దొరికిపోయిన దొంగ తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నది.

పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు

అమెరికాలో చంద్రబాబు అభిమానుల సమావేశంలో చంద్రబాబు శిష్యుడు అయిన పీసీసీ అధ్యక్షుడు తెలంగాణలో ఉచిత కరంటు విషయంలో తెలివితక్కువ తనంతో 3 గంటలు చాలు అని బయటపట్టాడు. కరంటు కొనుగోలు విషయం పారదర్శకంగా ఉంటే దాని మీద బురదజల్లడం రేవంత్ అవివేకానికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరంటు వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్