అన్నీ బాగుంటే మిషా అగర్వాల్ న్యాయాధికారి కావలసిన అమ్మాయి. కానీ కనిపించని న్యాయం కోసం ప్రాణాలు తీసుకుంది. మరో నాలుగు రోజుల్లో 25 వ పుట్టినరోజు జరుపుకోవలసి ఉండగా ఈ దుర్ఘటనకు పాల్పడింది. అన్నీ తెలిసీ అందరికీ చెప్పాల్సిన అమ్మాయి సోషల్ మీడియా మాయలో కొట్టుకు పోవడం అన్నిటికంటే విషాదకరం.
ఈ రోజుల్లో స్కూలు పిల్లలు మొదలుకొని వయసుడిగే పెద్దవాళ్లదాకా సరదాలు తీర్చుకోడానికి తమ కళా ప్రావీణ్యాలు ప్రదర్శించడానికి సోషల్ మీడియాని ఆశ్రయించడం ఎక్కువైంది. దాంతో కొంతమందికి విపరీతమైన ఫాలోయింగ్ వస్తోంది. సహజంగానే కొన్ని ఉత్పత్తులవారు ఈ ప్రహవశీలురను తమ ప్రకటనలకు వాడుకుంటూ డబ్బులిస్తున్నారు. యువతకు ఇదో ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే ఏ కారణం చేతనైనా ఫాలోయర్స్ తగ్గితే ప్రకటనలు, ఆదాయం తగ్గిపోతాయి. అప్పుడు మొదలవుతాయి అన్ని సమస్యలు. ఏం చేసినా ఫాలోయర్స్ పెరగకపోతే డిప్రెషన్ కమ్ముకుంటుంది. అది చివరకు ప్రాణాలు తీసుకునేవరకు వెళ్తోంది.
మిషా ఏం చేసింది ?
మిషా ఇంస్టాగ్రామ్ అకౌంట్ చూస్తే హాయిగా ఆడే పాడే అమ్మాయి కనిపిస్తుంది. ఆనందంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అలా కనిపిస్తూ తన ఆవేదన దాచిపెట్టింది మిషా. అయితే ప్రతి గంటకు తన ప్రొఫైల్ మార్చేదని, అస్తమానూ ఫాలోయర్స్ సంఖ్య చూసుకునేదని, అది తగ్గితే విపరీతమైన ఆందోళనకు గురయ్యేదని కుటుంబసభ్యులు అంటున్నారు. 3.5 లక్షల నుంచి ఫాలోయర్స్ తగ్గగానే మిషా తిండి తినడం, నలుగురితో కలవడం మానేసేదట.
చేతిలో లా డిగ్రీ ఉంది. న్యాయాధికారిగా ఎంపికవ్వాలని శిక్షణ తీసుకుంటున్న మిషా తన ప్రాధాన్యం విద్యలో తాను సాధించిన విజయాలకు కాకుండా సోషల్ మీడియాకు ఇవ్వడం అసలు సమస్య. మొదటినుంచీ ఈ విషయంలో ఆమెని గమనిస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటే బాగుండేదేమో. ఆఖరి రీల్ లో కూడా మేకప్ గురించి చెప్తూ సంతోషంగా కనిపించిన మిషా అకౌంట్ కు ఫాన్స్ నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. నటి తాప్సీ పన్ను సైతం సోషల్ మీడియా మాయలో పడి కొట్టుకుపోవద్దని, మీడియా బయటి జీవితమే అసలైనదని గుర్తించమని హితవు పలికింది. ఒక పరిశీలనలో 30 ఏళ్ళ లోపు భారతీయ యువత లో 68 శాతం పలు మానసిక సమస్యలకు గురవుతున్నారని తేలింది . మిషా కుటుంబసభ్యులు ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు చెప్పని సోషల్ మీడియానూ తప్పు పడుతున్నారు. ఒక వ్యక్తి పదే పదే తన అకౌంట్ చెక్ చేస్తుంటే గమనించే విధానాలు ఉండాలికదా అంటున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ డిప్రెషన్ కు గురయ్యేవారు సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మానసిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. వినిపిస్తోందా ఈ మాట ఉద్దేశించిన వారికి ?
-కె .శోభ