చిరంజీవి జోలికి రావొద్దని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నరసాపురంలో జరిగిన వారాహి యాత్రలో ప్రసంగించిన పవన్… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నేరుగా విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న సిఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులకు మద్దతుగా హీరో చిరంజీవి ఓ వీడియో సందేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సజ్జల స్పందిస్తూ ఎవరు ఎటువైపు ఉన్నారో దీనితో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. వీటిని ప్రస్తావిస్తూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి అజాత శత్రువని.. ఆయన ఎవరికి మద్దతు ఇస్తారో అయన ఇష్టమని…. మూడు రాజధానులకు అనుకూలంగా ఆయన మాట్లాడినప్పుడు కూడా.. సొంత తమ్ముడిని అయి కూడా ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. చిరంజీవి, రాష్ట్ర ప్రజలు, బడుగు-బలహీనవర్గాలు, శెట్టి బలిజలు, కాపుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. డబ్బులు ఎక్కువై, అధికార గర్వంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి ఏదో మాట్లాడితే ఆయన్ను కూడా తిట్టారని అన్నారు. చిరంజీవి జనసేనకు రూ. 5 కోట్లు ఇవ్వగానే… సిఎం రమేష్ కు మద్దతుగా మాట్లాడగానే ఆయనపై కూడా విమర్శలు మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. ఒక విప్లవకారుడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానన్నారు. తాను తెగించిన వాడినని, చంద్రబాబు కూడా జైల్లో పెట్టిన తరువాత ఆయనలో ఉన్న క్షమా గుణం కూడా లేదని.. తమకు ఢిల్లీలో మోడీ ఉన్నారని, ఎన్నికల సమయంలో ఎర్రి, కొర్రి వేషాలేస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఏ నాయకుడైనా జగన్ గొడుగు కిందకు వెళితే వారు రౌడీలు, గూండాలుగా మారుతున్నారని.. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును తిడితే అది మొత్తం క్షత్రియులను తిట్టినట్లు కాదన్నారు. కులాలను విడగొట్టి ఏపీని విచ్చిన్నం చేయలేరని… జగన్ కులాలను విడగొట్టిన కొద్దీ వారిని తానూ ఏకం చేస్తానని తేల్చి చెప్పారు.