ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా నోటీసులు జారీ చేసింది. రేపు ఈడి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో మొదలైన దుమారం నేటికీ కొనసాగుతోంది. కవితకు బినామీగా వ్యవహరిస్తారని పేరున్న అరుణ్ రామచంద్ర పిళ్ళై అప్రూవర్ గా మారిన నేపథ్యంలో తాజా నోటీసులు చర్చనీయంశంగా మారాయి.
ఇన్నాళ్ళు కవిత ను అరెస్టు చేయకపోవటంతో బిజెపి-బీ ఆర్ ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లో దుమారం లేపాయి. కవితను అరెస్టు చేయకపోతే రాష్ట్రంలో బిజెపికి నష్టం జరిగే అవకాశం ఉందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, శరత్ చంద్ర రెడ్డి, బుచ్చిబాబు, ఇప్పటికే అప్రూవర్ లు గా మారారు. తాజాగా రామచంద్ర పిళ్ళై తో కలుపుకొని ఆరుగురు మద్యం కుంభకోణంలో అప్రూవర్ లుగా మారారు. తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైన ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు ఇవ్వటం ఎవరికీ మేలు చేస్తుంది అనే కోణంలో విశ్లేషిస్తే ఖచ్చితంగా కెసిఆర్ కు లాభం జరుగుతుంది.
మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పుంజుకోవాలి అంటే మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాల్సిందే అని రాష్ట్ర బిజెపి నాయకులు కేంద్ర నాయకుల వద్ద వీలైనప్పుడల్లా చెపుతూనే ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.