Minister, Collector tour:
జవాద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు పర్యటించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పలాస మున్సిపాలిటీ ప్రధాన రహదారిపై పేరుకు పోయిన చెత్తను తొలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది సహాయంతో పూడికలు తొలిగించి, జేసిబిలతో డ్రైనేజీ అడ్డంకులు తొలగించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం పలాస మండలం బ్రహ్మణతర్ల, అమలకుడియా ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటపోలాలను పరిశిలించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రజలు ఎవరూ తుఫాన్ తీవ్రత తగ్గేవరకు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
తుఫాన్ అనంతర పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. తుఫాను పరిస్థితులను పరిశీలించేందుకు సంతబొమ్మాలి మండలం కారిపేట తదితర ప్రాంతాల్లో కలెక్టర్ శనివారం పర్యటించారు. ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, అందిస్తున్న ఆహారపదార్థాలను పరిశీలించారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. కేంద్రంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వర్షాలకు గోడలు తడిసిపోయి ఉండవచ్చని, గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగవచ్చని, విద్యుత్ తీగలు క్రిందకు ఉండవచ్చని వాటిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలకు వర్షపు నీరు తాగునీటితో కలిసి కలుషితం కావడం వలన పలు వ్యాధులు సంభవించే అవకాశాలు ఉంటాయని వాటిని పరిశీలించాలని అన్నారు.
నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణం సంబంధిత వైద్య అధికారిని కలవాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో సమస్య ఉంటే వాటిని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని చెప్పారు. అధికారులకు సహకారం అందిస్తూ తుఫాను సమయంలో సురక్షితంగా ఉండుటకు ప్రయత్నించాలని కలెక్టర్ అన్నారు.