Wednesday, September 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెళ్లే వద్దంటున్న మహిళలు

పెళ్లే వద్దంటున్న మహిళలు

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది పాత సామెత. రాజ కుమార్తె తలచుకుంటే దేనికి కొదవ అని కొత్త సామెత చెప్పే సంఘటన ట్రెండింగ్ అవుతోంది.

షీకా మహరా దుబాయ్ రాజు కూతురు. ఆయనకున్న 26 మంది సంతానంలో ఆమె ఒక కుమార్తె. లండన్ లో చదువుకుంది. అభ్యుదయ భావాలు ఉన్నాయి. ఏడాదిన్నరక్రితం వివాహమైంది. ఈ మధ్యనే పాప కూడా పుట్టింది. అప్పుడే భర్తకి ఉన్న ఇతరేతర సంబంధాల గురించి తెలిసింది ఆమెకి. భరించలేకపోయింది. ఇంస్టాగ్రామ్ లో భర్తకి అతని సంబంధాల గురించి చురక వేసి మూడుసార్లు తలాక్ చెప్పింది. అక్కడితో ఆగలేదు. ఈమధ్య ఒక పెర్ఫ్యూమ్ విడుదల చేసింది. దానిపేరు ‘డైవోర్స్’. భర్త కారణంగా కలిగిన దెబ్బని తట్టుకుని నిలబడటమే కాకుండా తన వ్యాపారానికి వాడుకున్న తీరు చాలామందికి నచ్చింది. సోషల్ మీడియాలో ఈమెను అనేకమంది ప్రశంసిస్తున్నారు.

పెళ్లి, పిల్లలు జాన్తా నై
ఇప్పటికే వివాహవ్యవస్థ దెబ్బతిందనే వాదనకు మద్దతుగా ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ సర్వే విడుదల అయింది. దాని ప్రకారం సమాజంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. 2030 నాటికి 22-45 వయసు మహిళల్లో 45 శాతం ఒంటరిగా, పిల్లలు లేకుండా ఉంటారు. గతంలో అమ్మాయిలకు ఇరవైలలో పెళ్లయ్యేది. దాంతో వారికి కుటుంబంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు. ఉద్యోగాలు చేసేవారు పెరిగారు. ప్రధానాదాయం అమ్మాయిలది కూడా. ఈ ఆర్థిక స్వేచ్ఛ వారికి ఇతర నిర్ణయాల్లోనూ స్ఫూర్తినిస్తోంది.

పెళ్లి అనే బంధం తగిలించుకుని కుటుంబ చట్రంలో ఇరుక్కోడంకన్నా ఉద్యోగంలో ఎదగడం మేలని భావిస్తున్నారు. ఉద్యోగానికి అడ్డనుకుంటే విడాకులకు కూడా సిద్ధమంటున్నారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న విడాకులు ఇందుకు నిదర్శనం. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని బ్యాలన్స్ చేయలేకపోవడం, ఉద్యోగంలో అడ్డంకులు, పిల్లల ఖర్చు … ఇవన్నీ మహిళల మైండ్ సెట్ ను మార్చేస్తున్నాయి. హాయిగా సంపాదించి ఎంజాయ్ చెయ్యక సంసారం కోసం తాపత్రయం ఎందుకని భావిస్తున్నారు. అవివాహితలు, ఒంటరి మహిళలు కంపెనీలకు వరంగా మారారు. వారి శక్తి యుక్తులు కంపెనీల అభివృద్ధికి ధారపోస్తున్నారు. అయితే ఈ పోకడ కారణంగా కుటుంబాలున్న మహిళలకు పనివేళలు, సమాన జీతభత్యాలు వంటి అంశాల్లో వెసులుబాటు రావచ్చనికూడా సర్వే అభిప్రాయపడింది. ఈ సర్వే కొంతమందికే ప్రామాణికం కావచ్చు గానీ అటు దుబాయ్ రాకుమారి నుంచి ఇటు సాధారణ మహిళలవరకు’ లేచింది మహిళాలోకం – దద్దరిల్లుతోంది పురుషప్రపంచం’ అనుకోవాలేమో!

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్