Saturday, September 21, 2024
HomeTrending NewsDwarampudi: పవన్... దమ్ముంటే నాపై పోటీ చెయ్యి: ద్వారంపూడి సవాల్

Dwarampudi: పవన్… దమ్ముంటే నాపై పోటీ చెయ్యి: ద్వారంపూడి సవాల్

దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై కాకినాడలో  పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.  వచ్చే ఎన్నికల్లో తనను గెలవనీయనని సవాల్ చేశారని, తన పతనం ప్రారంభమైందని పవన్ సవాల్ చేశారు కాబట్టి దానికి తాను దాన్ని స్వీకరిస్తున్నానని ప్రకటించారు.  ఎవరో ఎందుకని… పవన్ స్వయంగా పోటీ చేయాలని, ఆయన్ను ఓడించకపొతే తాను చంద్రశేఖర్ రెడ్డినే కాదని… ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని, ఒకవేళ పవన్ ఓడిపోతే రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచించారు. కాకినాడ నుంచి వెళ్ళిపోయేలోపు తన ఛాలెంజ్ ను స్వీకరించాలని కోరారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ద్వారంపూడి నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

ఎమ్మెల్యే కావాలన్నా, సిఎం కావాలన్నా పవన్ కళ్యాణ్ కు సినిమాల్లోనే సాధ్యపడుతుందని, ప్రజల నుంచి ఎన్నిక కావడం అతని వల్ల కాదని తేల్చి చెప్పారు. తన దగ్గర రూ. 15 వేల కోట్లు ఉంటే తానే అతన్ని కొని ఉండేవాడినని, బాబు ఇచ్చే ప్యాకేజ్ ఏదో తానే ఇచ్చేవాడినని ఎద్దేవా చేశారు.  ‘పార్టీ స్థాపించిన రోజు నీతో ఉన్నవారు ఒక్కరైనా ఇవాళ నీతో ఉన్నారా’ అని ప్రశ్నించారు. ముప్పై  ఏళ్ల క్రితం నాతో ఉన్నవారు ఇప్పటికీ తనతోనే ఉన్నారన్నారు.  వంగావీటి రంగా కాకినాడ మీటింగ్ ను తానే ఆర్గనైజ్ చేశానని, జక్కంపూడి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి మూడుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచానన్నారు. పొలిటికల్ గా పవన్ జీరో అన్నారు. రెండు చోట్ల పోటీ చేసి రెంటిలోనూ ఓటమి పాలయ్యారని అన్నారు.

చంద్రబాబు బాగోగులు చూసేందుకు పార్టీ పెట్టారా, ప్రజల బాగోగులు చూసేందుకు రాజకీయాల్లోకి వచ్చారా అంటూ పవన్ ను ద్వారంపూడి నిలదీశారు.  పవన్ రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు.  మూడు నెలల క్రితం పొత్తులో వెళ్తున్నామని చెప్పి, ఇప్పుడేమో నేను సిఎం అవుతా, నన్ను ఎమ్మెల్యే చేయమని అడుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుతో బేరం కుదరనందుకే ఇప్పుడు మాట మార్చారన్నారు. సామాజిక పరంగా ఒక్కడ బలంలేకపోయినా రెండుసార్లు కాకినాడలో గెలిచానన్నారు.  తాను రౌడీని, గూండాను, కబ్జాదారుడిని అయితే ఎలా గెలుస్తానని అడిగారు. ఎవడో చెప్పిన మాటలు విని కోతి గంతులు వేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తాను మందు, సిగరెట్ కనీసం టీ, కాఫీ కూడా తాగనని వెల్లడించారు. ‘నీకన్నా పెద్ద నాలుక నాది, నీకన్నా గట్టిగా మాట్లాడగలను… పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ’ అంటూ హెచ్చరించారు.

‘చంద్రబాబుకు ఇవి చివరి ఎన్నికలు, బాబు లేకపోతే నువ్వు కూడా ఉండవు కాబట్టి నీకు కూడా ఇవే లాస్ట్ ఎలక్షన్స్’ అని ధ్వజమెత్తారు. డి బ్యాచ్ అంటూ పవన్ వ్యాఖ్యలపై కూడా ద్వారంపూడి స్పందిస్తూ నాది డి బ్యాచ్ అయితే నీది ‘పి’ ప్యాకేజ్ బ్యాచ్ అనొచ్చా అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్