పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఎంతమందికి తొక్క, నార తీసి కింద కూర్చో బెట్టారో, ఎంతమందికి గుండ్లు కొట్టించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో చెప్పాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. పవన్ తన ప్రసంగాలలో పదే పదే ఈ పదాలు వాడుతున్నారని, పది మంది చేత ప్రేమించబడాలి కానీ, వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకూ న్యాయమని నిలదీశారు. ‘గౌరవనీయులు ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి…’ అంటూ ఓ బహిరంగ లేఖను ముద్రగడ నేడు విడుదల చేశారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంపై పవన్ చేసిన వ్యాఖ్యలను ముద్రగడ ఆక్షేపించారు. తనకు ఆ కుటుంబంతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, వారు తప్పుడు మార్గాల్లో సంపాదించారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తే తిరస్కరించానని, ఆ సమయంలో చంద్ర శేఖర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, తాత కృష్ణారెడ్డిలు తన వద్దకు వచ్చి పదిమందికి ఉపయోగపడొచ్చని చెప్పి తనకు నచ్చజెప్పారని గుర్తు చేసుకున్నారు. 1988లో కాపునాడు సభకు, 1993-94 కాపు ఉద్యమ సమయంలో వారు రవాణా, పోస్టర్ల ఖర్చులకు ఆర్ధికంగా వారు చేయూత ఇచ్చారని వెల్లడించారు. కాపు ఉద్యమాలకు సహకరించిన వారిపై విమర్శలు చేయడం తగదన్నారు. ద్వారంపూడి దొంగ అయితే రెండుసార్లు ఎందుకు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారని పవన్ ను ప్రశ్నించారు.
టిడిపి-బిజెపి-జనసేన పొత్తుతో పోటీ చేస్తాయని చెబుతూనే నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని పవన్ అడగడంపై ముద్రగడ విస్మయం వ్యక్తం చేశారు. 175 స్థానాలకు పోటీ చేస్తేనే సిఎం చేయండి అనే పదం వాడాలి కానీ కలిసి పోటీ చేసేటప్పుడు మీరే సిఎం అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.