Sunday, February 23, 2025
HomeTrending Newsరామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన

రామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన

Ramateertham Temple:
విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీకోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే రూ.3 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయబోతోంది. 22వ తేదీ ఉదయం 10.08 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ తదితరులు పాల్గొంటారు.

మెట్ల మార్గం, కోనేరు ఆధునికీకరణ :
కొండపై ఉన్న ఆలయంలోని శ్రీరాముని విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండగులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహాల ప్రతిష్టతో పాటు ఆలయం మొత్తాన్నీ పునః నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కొండ రాయితో ఉండే పాత ఆలయం స్థానంలో డ్రస్డ్‌ గ్రానైట్‌ రాయితో అభివృద్ధి చేస్తారు. గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారాన్ని కూడా పునః నిర్మించబోతున్నారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరును పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తారు. భక్తులు పొంగళ్లు వండుకునేందుకు వీలుగా కొండపైన ఆలయ ప్రాంగణంలోనే పాకశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతకుముందు భక్తులు పొంగళ్లను కొండ దిగువున వండి, వాటిని కొండపైకి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వీటికి తోడు కొండపైకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిన మెట్ల మార్గాన్ని కూడా ఆధునీకరిస్తారు.

ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా డిజైన్లు :
ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ పునః నిర్మాణానికి దేవదాయ శాఖ, ఇంజినీరింగ్‌ అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అవసరమైన గ్రానైట్‌ రాయిని కాంట్రాక్టర్‌ ఇప్పటికే ఆలయ ప్రాంగణం వద్దకు తరలించారు. పెద్దపెద్ద గ్రానైట్‌ రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రిని 600 అడుగుల ఎత్తులో ఉండే కొండపైకి సులభంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన తర్వాత 6 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేవదాయ శాఖ అధికారి వాణీ మోహన్‌ తెలిపారు.

Also Read : రాష్ట్ర వ్యాప్తంగా వివేకానంద జయంతోత్సవాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్