AP Government: EBC Nestam :
ఆర్ధికంగా వెనుకబడిన కులాల్లోని మహిళల ఆర్ధిక స్వావలంబనకు జనవరి 9నుంచి ‘ఈబీసీ నేస్తం’ పథకాన్ని ప్రవేశ పడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ‘మహిళా సాధికారత’ అంశంపై నేడు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సిఎం మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ‘వైఎస్సార్ చేయూత’; కాపు అక్కచెల్లెమ్మల కోసం ‘కాపు నేస్తం’ పథకాలు అమలుచేస్తున్నామని, ఈ కోవలోనే అగ్ర కులాల్లోని మహిళల స్వయం సమృద్ధి, స్వావలంబన కోసం ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా తాము అమలుచేస్తున్న పథకాలతో 21వ శతాబ్దపు భారతీయ మహిళ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆవిర్భవిస్తుందని సగర్వంగా చెప్పగలుగుతామన్నారు.
మహిళా భద్రత కోసం ఇప్పటికే దిశ చట్టం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపామని, కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించి పంపాల్సి ఉందని, ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని పంపిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షలమంది అక్కచెల్లెమ్మల మొబైల్ ఫోన్లలో దిశా యాప్ ఉందని, ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ షేక్ చేస్తే చాలు, వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుంటారని చెప్పారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా 6,880 మందిని కాపాడ గలిగామని వివరించారు.
30 లక్షల మంది మహిళలకు మేలు చేసే విధంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ళ స్థలాలు కేటాయిస్తే, కోర్టులకు వెళ్లి ఇలాంటి మంచి పథకాన్ని ఆపాలనుకోవడం సమంజసమేనా అని ప్రతిపక్షాన్ని జగన్ ప్రశించారు. ఎక్కడ జగన్ కు మంచి పేరు వస్తుందో అనే దుర్బుద్ధితో వ్యవహరిస్తే…వారికి దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తాడని, అందుకే వారికి కుప్పంలో మొట్టికాయలు వేశారని ఎద్దేవా చేశారు.
నామినేటెడ్ పోస్టులు, స్థానిక, పురపాలక సంస్థల్లో మహిళలకు ఎక్కువ సంఖలో సీట్లు కేటాయించామని తెలిపారు. ఇటీవలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల్లో కూడా అధిక భాగం మహిళలకే కేటాయించామని అంటూ… ఎమ్మెల్యేలో ఎక్కువమంది పురుషులే ఉన్నారు కాబట్టి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని, కానీ అందరూ తమను దీవిస్తారని, ఆశీర్వదిస్తారని అనుకుంటున్నానని సిఎం జగన్ సభలో నవ్వులు పూయించారు.
కుప్పం లాంటి చోట కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అక్కచెల్లెమ్మలు బ్రహ్మరథం పట్టడం, తమ పార్టీ పట్ల మహిళల ఆదరణకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పురావాలని, మహిళా సాధికారత విషయంలో ఎలా ఉండాలనేది ఇప్పటికైనా అర్ధం కావాలని హితవు పలికారు. కుళ్ళు, కుట్రలతో ఇళ్ళపట్టాలు ఆపడం లాంటి కుట్రలు చేయకుండా ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఈ చర్చ సమయంలో చంద్రబాబు కూడా ఉంటే బాగుండేదని, అయన వస్తారనే చర్చను కొంత సేపు జాప్యం చేశామని, అయన ఇక్కడున్నారో లేదో కూడా తమకు తెలియదని సిఎం జగన్ వ్యాఖ్యానించారు. ఎక్కడ వున్నా ఈ చర్చను టీవీల్లో చూస్తూ ఉండి ఉంటారని, కుప్పం ఫలితాల ప్రభావం వల్లే అయన రాలేదేమో అని వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, ప్రతి సందర్భంలోనూ కోర్టులకు వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని జగన్ సూచించారు.
Also Read : గవర్నర్ కు సిఎం పరామర్శ