అసాధారణ స్థాయిలో కుండపోతగా కురిసిన భారీ వర్షానికి ముంపుకు గురి అయిన ప్రాంతాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గంట వ్యవధిలోనే శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం వల్ల తలెత్తిన ఇబ్బందులను ప్రజల నుండి తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లి మునిసిపాలిటీ లోని అమ్రీన్ కాలనీ,రాయల్ కాలనీ,డ్రీమ్ సిటీ,మెట్రో సిటీ తదితర ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు.వివిధ చెరువుల పరివాహక ప్రాంతాలు,లోతట్టు ప్రాంతాల్లో చెరువులు ఉప్పొంగటం తో పలు కాలనీలు జలమయం అయ్యాయి. చెరువుల మధ్య అనుసంధానం చేస్తూ ఉస్మాన్ నగర్ చెరువు నుండి వచ్చే నీటి కోసం నాలా నిర్మించడానికి 10 కోట్లు 18 లక్షలు, సలాల చెరువు నీరు సాఫీగా పోవటానికి 5 కోట్ల తో పనులు చేపట్టనున్నట్లు,త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.కొత్తపేట కుమ్మరి కుంట నుండి వస్తున్న నీటి కోసం నాలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
జి హెచ్ ఎం సి,దాని పరివాహక ప్రాంతాల్లో చెరువుల మధ్య లింక్ కోసం 850 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో మంత్రి కే టి ఆర్ విడుదల చేసారన్నారు. రాజేంద్రనగర్ లోని అప్పా చెరువు వద్ద కూడా ఇదే విధంగా నాలా నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలిపారు.నాలా నిర్మాణం లో వర్షపు నీరు మధ్య నుండి వెళ్లేలా,సైడ్ లలో డ్రైనేజి లైన్ వేస్తున్నట్లు,తద్వారా ఇళ్ల వారు అందులో కలుపటానికి వీలు ఉంటుందన్నారు. 100 సంవత్సరాల కింద పడిన వర్షం గత సంవత్సరం పడగా,అదే స్థాయిలో మళ్ళీ వర్షం పడిందని,శాశ్వత ముంపు నివారణ ద్వేయంగా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.