“ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర!
ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర!
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు
నీవు దూకిన నేల మాకు విద్యున్మాల
నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము
ఎవరికొరకయి పరుగులెత్తి వచ్చితివి?
ఎవరి జూచి తటాకమై నిల్చిపోతివి?”
అని మంజీరా నదితో మాట కలిపిన దాశరథి మధ్యలో ఏడుపాయల వనదుర్గ గురించి ప్రస్తావించారు.
“ఎవ్వరే యెదురొచ్చి ఏడుపాయలు చేసి
రవ్వల్ల వీణపై రాగమొత్తిరి నిన్ను?
ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను?
యేమన్నదే నిన్ను యేడుపాయల దుర్గ?
ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది
పాడుకొమ్మన్నాది పరుగులిడమన్నాది
స్వర మొక్క పాయగా సాగి పొమ్మన్నాది
బంగారు పండించి ప్రజలకిమ్మన్నాది”
మంజీరా నదిని వనదుర్గ ఏడుపాయలు చేసి…నీటి గలగలతో జలజలా పాడుకుంటూ…సాగిపొమ్మని చెప్పిందట. ఏడు పాయలు ఏడు స్వరాలుగా సాగుతూ బంగారు పంటలు పండించి ప్రజలకిమ్మని వనదుర్గమ్మ మంజీరకు చెప్పిందట.
కలియుగారంభంలో పండులో దూరి పరీక్షిత్తును కాటు వేసి తక్షకుడు(సర్పం) చంపేస్తాడు. తరువాత ఎప్పుడో ఆ విషయం పరీక్షిత్తు కొడుకు జనమేజయుడికి తెలుస్తుంది. తన తండ్రిని చంపిన సర్పజాతి మొత్తాన్ని బూడిద చేసి నామరూపాల్లేకుండా చేయాలని జనమేజయుడు చేసిందే “సర్పయాగం”. కొన్ని కోట్ల జాతులు అందులో పడి నశించాయి. తక్షకుడి పేరు చెప్పి స్వాహా అనగానే…తక్షకుడు చావు భయంతో ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుంటాడు. జనమేజయుడు “స ఇంద్రతే తక్షకాయస్వాహా” అంటాడు. ఇంద్రుడి సింహాసనంతో పాటు కదిలిపోతుంది. అప్పుడు దేవతలు కలుగజేసుకుని…ఇప్పటికే కొన్ని కోట్ల సర్పజాతులు నశించాయి..శాంతించు నాయనా! అని జనమేజయుడిని చల్లబరుస్తారు. తక్షకుడు బతికిపోతాడు.
పాములకు- గద్దలకు జాతి వైరం. జనమేజయుడు సర్పయాగంలో ఫలానా కట్లపాము, నాగు పాము అని పేరు చెప్పగానే గరుత్మంతుడు ఆ పాములను కాలి గోళ్ల మధ్య తెచ్చి సర్పయాగంలో పడేసేవాడు. అలా ఆకాశమార్గంలో గరుత్మంతుడు పాములను తీసుకెళుతున్నప్పుడు వాటి రక్తం మంజీరలో పడి జలాలు ఎర్రగా అయ్యాయి. ఆ జలాలు తాగుకు, సాగుకు పనికిరాకుండా పోయాయి. దాంతో వనదుర్గ ఒక పాయను ఏడు పాయలుగా పలుచన చేసి…అందులో విషరక్తాన్ని తొలగించి…నీటిని పవిత్రీకరించింది. అందువల్ల ఇక్కడి దేవతకు “ఏడుపాయల వనదుర్గ” అన్న పేరు స్థిరపడిందని క్షేత్ర మాహాత్మ్య కథనం.
ప్రత్యేక పర్వదినాల్లో వనదుర్గను పేరుకు తగ్గట్లు చెట్ల కొమ్మలు, ఆకులు, తీగలు, పువ్వులు, కాయలు, పళ్లతో అలంకరిస్తారు. వజ్రాభరణాలకంటే వనదుర్గకు వనాలంకారాలే ఇష్టం అన్నది భక్తుల నమ్మకం.
రేపు:-
“వీణాగాన సరస్వతి”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు