Monday, January 20, 2025
HomeTrending Newsఓట్లు, సీట్లు, అధికారం యావనే కెసిఆర్ కు - ఈటెల విమర్శ

ఓట్లు, సీట్లు, అధికారం యావనే కెసిఆర్ కు – ఈటెల విమర్శ

ఊరు పేరు ఏమో కస్తూరివారు ఇంట్లోనేమో గబ్బిలాల వాసన అన్నట్టు కేసీఆర్ పనితీరు ఉందని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి చిల్లర,గల్లి, గుండా రాజకీయాలు చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించిన ఈటెల రాజేందర్…కెసిఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు.

ఈటెల రాజేందర్ మాట్లాడుతూ :

సర్పంచ్లను అష్ట కష్టాలు పెడుతున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 14 ఫైనాన్స్ నిధులు ఇస్తే , రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. కానీ యుటిలైజేషన్ సర్టిఫికెట్ సకాలంలో కేంద్రానికి పంపించకపోవడం వల్ల నిధులు విడుదల కావడం లేదు. అన్ని శాఖలలో అదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. కనీసం చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. సర్పంచి పోస్టు సుంకరోల్ల కంటే అద్వాన్నం అయిపోయింది. దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? బిల్లులు రాక, నిధులు లేక గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు రావడం లేదు. ప్రగల్భాలు పలకడం కాదు.. పేరుకు ధనిక రాష్ట్రం, గొప్ప పరిపాలన, దేశానికి ఆదర్శం తెలంగాణ అని చెప్తారు. ఊరు పేరు ఏమో కస్తూరివారు ఇంట్లోనేమో గబ్బిలాల వాసన అన్నట్టు కేసీఆర్ పనితీరు ఉంది. సర్పంచులను సస్పెండ్ చేస్తా అని బెదిరించవచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల సర్పంచులు ఈ ప్రభుత్వం మా ఉసురు పోసుకుంటుంది అనే భావనతో ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కసి తీర్చుకుంటారు.

రైతు సమస్యలపై:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పారు. దానికి తగ్గట్టుగా పండిన పంటలు కొనే వ్యవస్థను మాత్రం అమలు చేయలేక పోతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత డోలాయమానంలో రైతులు లేరు. పంట అమ్ముకోవచ్చు అనే భరోసా లేకుండా పోయింది. రాజకీయాలు గంగలోపోనీ.. కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడి, రైతుల కళ్ళల్లో మట్టికొట్టవద్దు. 40 కిలోల బస్తాకు రెండు నుండి నాలుగు కిలోల తరుగు తీస్తున్నారు. మిల్లును బట్టి రైతు పరిస్థితిని బట్టి వడ్లను దించుకునే స్థితి వచ్చింది. క్వింటాల్ ధాన్యంకు మిల్లర్లు రైతు దగ్గర 10 కేజీలు కట్ చేస్తున్నారు. ఎకరానికి మిల్లర్ల దగ్గర కట్ అయ్యే వడ్ల విలువ 5 వేల రూపాయలు. ఎకరానికి రైతుబందు పేరుతో 5000 రూపాయలు చేతిలో పెట్టి.. కటింగ్ పేరుతో అంతే డబ్బులు పోతుంటే పట్టించుకునే నాధుడు లేడు.
ఎంతసేపటికి ఓట్లు, సీట్లు, అధికారం, తన కీర్తి తప్ప ప్రజా పరిపాలనను కేసీఆర్ గాలికి వదిలివేశారు. సీజన్ వస్తుంది అంటే ముఖ్యమంత్రి సమక్షంలో ప్రతిపక్షాలతో మీటింగ్ ఉండేది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి అందరి ముఖ్యమంత్రులు సీజన్ కు ముందు మీటింగ్ పెట్టేవారు. ఎక్కడ ఇబ్బంది కాకుండా గన్ని బస్తాలు, ట్రాన్స్పోర్ట్, గోదాములు, హమాలీలు ఇబ్బందులు లేకుండా సీఎం సమీక్ష ఉండేది. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను గుర్తించరు. సమీక్షలు పెట్టరు. ఉంటే ప్రగతిభవన్లో లేదంటే ఫామ్ హౌస్ లో తప్ప సచివాలయం రారు. మంత్రులకు స్వేచ్ఛ లేదు.

కరీంనగర్ జిల్లా వరి పండించే ప్రాంతం. ఐకెపి సెంటర్లు ప్రారంభించామని చెప్పినప్పటికీ, సొసైటీ సెంటర్లో ఓపెన్ చేసిన ఎక్కడ కూడా కొనుగోలు లేవు. వరికుప్పలన్నీ రోడ్లమీదనే ఉన్నాయి. 20-30 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందో లేదో అని రైతులే స్వయంగా1600 కు 1650 రూపాయలకు కల్లాల దగ్గర తెగనమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే ఐకెపి సెంటర్లు ఓపెన్ చేయాలి. కటింగ్ లేకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా సకాలంలో పంటను దించుకోవాలని. వెంటనే డబ్బులు వేయలని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి చోద్యం చూడకుండా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నాను.

ముఖ్యమంత్రికి చాలా రోజుల తర్వాత జ్ఞానోదయం అయింది. 2014లో అధికారం వచ్చిన తర్వాత.. 2015లో అసలు కథ మొదలైంది. నా రాజ్యంలో సమ్మెలకు అవకాశం లేదు, సంఘాలు ఉండవద్దు, ఈ దబ్బనం పార్టీలు, సూది పార్టీలు, గుండు పిన్ను పార్టీలు వద్దు. నా రాజ్యంలో ధర్నాచౌక్ లు ఉండవు. నా రాజ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉండవద్దు,.ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, సెకండ్ ఎఎన్ఏం, వీఆర్ఏ, వీఆర్వో ఎవరైనా సరే సమ్మెలు చేస్తే ఉక్కు పాదం పెట్టారు.
మున్సిపల్ కార్మికుల మీద వేటు వేసి 1500 మీద తొలగించారు. వీఆర్ఏలు 60 మంది చనిపోతే దరఖాస్తు ఇవ్వడానికి పోతే ముఖం మీద కొట్టారు. ఎమ్మార్పీఎస్ కావచ్చు, గిరిజన, బీసీ సంఘాలు కావచ్చు ఏ సంఘాలు అయిన ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ తొక్కివేసారు. ఆయన చేసిన దుర్మార్గం ఏంటంటే ఏ చైతన్యం ద్వారా తెలంగాణ వచ్చిందో.. ఆ చైతన్యాన్ని చంపేశారు. ఈ సంఘాల అండతో తెలంగాణ వచ్చిందో వాటిని మూసేశారు. తెలంగాణ వచ్చేంతవరకు బస్సు పయ్య కదలదు అన్న వారిని ఇబ్బందులు పెట్టారు. అనేక వర్గాల ప్రజలు గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా వారి సంఘాలకు గుర్తింపు గౌరవం లేక బాధపడ్డారు. దరఖాస్తు స్వీకరించి పరిస్థితి లేదు.

మరి ఇప్పుడు ఎందుకు జ్ఞానోదయమైందో కానీ ఎవరైతే వద్దనుకున్నారు వాళ్ల కాళ్ల దగ్గరికి కెసిఆర్ పోతున్నారు. ఆర్టీసీ కార్మికులారా రండి రండి, ఉద్యోగ సంఘాల వారు రండి అని పిలుస్తున్నారు. సిపిఎం పార్టీని ఒకపక్క, దబ్బనం పార్టీనీ ఇంకోపక్క గుండుసూది పార్టీని వెనక పక్క కూర్చోబెట్టుకొని కాపాడాలి కాపాడాలి అంటున్నారు.
వరవరరావు,.కూరరాజన్నలను పరామర్శించారు.. కానీ అదే ఆలోచనతో ఉన్న శృతి, విద్యాసాగర్ అనే ముక్కుపచ్చలారని పిల్లలను వరంగల్ జిల్లాలో చంపేశారు. మీ అక్కర నాకు అయిపోయింది. 2014 వరకు మీ సపోర్టు సరిపోయింది.. ఇప్పుడు మా దగ్గర మీ చెల్లుబాటు లేదు అని ఒక మెసేజ్ నక్సలైట్లు పార్టీలకు ఇచ్చారు.
హరగోపాల్ లాంటి వారు ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇవ్వాలంటే ఎన్నడూ ఒక అపాయింట్మెంట్ ఇచ్చిన దిక్కులేదు. కనీసం కలిసే ఆస్కారం లేకుండా చేశారు. సీపీఐ వారు మన తెలంగాణ పత్రిక గుంజుకుంటున్నారు అని మా దగ్గరికి వస్తే బాధపడ్డాం తప్ప ఏం చెయ్యలేకపోయాం. వందలసార్లు సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు కార్మికుల పక్షాన నిలబడి సమ్మె చేసేటప్పుడు మా దగ్గరికి వస్తే సీఎం దగ్గరికి తీసుకొని పోలేకపోయాం. అన్ని రకాల చైతన్యాన్ని నాశనం పట్టించారు.. అన్నీ చేసి ఇప్పుడు ప్రజలారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కేసిఆర్ అంటున్నారు. మళ్లీ ప్రజాక్షేత్రంలో ఆయన గెలిచేంతవరకు మాత్రమే ఈ డ్రామాలు. అప్పుడు అసలు స్వరూపం బయటపడుతుంది. అప్పుడు మాలాంటి వాళ్లే మీకు దిక్కు అవుతారు.

ప్రధానికి ముఖ్యమంత్రి ముఖం చాటేసారు. ప్రధానమంత్రికి చూపించడానికి ముఖం చెల్లక ఢిల్లీకి పారిపోయారు. ఇక్కడ మాత్రం కమ్యూనిస్టు పార్టీలను ముందు పెట్టారు. తెలంగాణ ప్రజానీకం అందరూ అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి జీతగాళ్లు కాదు ఈ రాష్ట్రం, దేశంలో ఒక భాగం. ప్రజాస్వామ్య స్వేచ్ఛను, లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పిచ్చి పనులు చేయరు అని నేను అనుకుంటున్నాను.

2013 లోనే 750 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును గ్రానైట్ కంపెనీలు ఎగవేసుకు పోతున్నారని వార్తలు వచ్చినయి. దానికి సంబంధించిన దాడులు ఇవి. ముఖ్యమంత్రి అవినీతి లేని ప్రభుత్వం మాది అంటున్నారు కదా.. ఢిల్లీకి పోయి లిక్కర్ షాపులు కోట్ల రూపాయలు గుత్తా పడుతున్నారంటే.. స్వయంగా మీ కుటుంబ సభ్యులే ఉన్నారంటే.. అధికారం ఇచ్చింది దోచుకోవడానికా? అధికారం ఇచ్చింది లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికా ? కెసిఆర్ దేశానికి అందించిన గొప్ప సంస్కృతి ఓటుకి నోటు. ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజల హక్కులకు విలువ కట్టి, నీచమైన నికృష్టమైన రాజకీయాలకు తెరలిపిన వ్యక్తి కేసీఆర్. BRS పెట్టీ దీన్ని దేశానికి అందిస్తారంట. నార్త్ ఇండియాలో ఎక్కడైనా 30-40 లక్షలు పెడితే గెలుస్తారు.
హుజురాబాద్ నియోజకవర్గానికి మానేరు నది మాకు ప్రాణ ప్రదం. ఉన్న ఇసుకనంత తవ్వి ఎందుకు మా ఉసురుపోసుకుంటున్నారు. ఇసుక కెసిఆర్ కుటుంబానికి గొప్ప వరం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఏనాడన్న మానేరు ఇసుక మీద కన్ను వేసిందా ? నామీద కోపం ఉండొచ్చు కానీ మా ప్రజల మీద కోపం ఎందుకు.

గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే వస్తాయా అని కేసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో అడుగుతున్నారు. 2014,2018 లో ఏ గాడిదకు ఓటు వేశారు అని నేను అడిగితే ఎలా ఉంటుంది? ఇంత సంకుచితమైన నీచమైన ఆలోచన కెసిఆర్ ది. ఇక్కడి నాయకులు ప్రజాస్వామ్యం లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. మీకు తల్లి లేదా నా భార్య గురించి మాట్లాడటానికి. బొక్కలు చుర చుర చేస్తా అని మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు చంపుతారా ? ముఖ్యమంత్రి స్థాయి మరిచి చిల్లర,గల్లి, గుండా రాజకీయాలు చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి కెసిఆర్. నా ప్రజలను వేధిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులారా రండి మా హుజురాబాద్ కి ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తా.. అనుభవిస్తే మీకు తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్