తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అయితే కొన్ని షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజదాని లాంటి అంశాలపై చర్చించకూడదని నిర్దేశించింది. లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ 4 వరకూ వేచ చూడలేని అంశాలపైనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరూ ఈ కేబినెట్ భేటీకి హాజరు కాకూడదని ఆదేశించింది.
వాస్తవానికి నిన్న కేబినేట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. లోక్ సభ సాధారణ ఎన్నికలతో పాటు, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో భేటీ నిర్వహించేందుకు ఈనెల 16న రాష్ట్ర ప్రభుతం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారికంగా లేఖ రాశారు. నిన్న సిఎం, మంత్రులు సచివాలయానికి వచ్చి ఈసీ అనుమతి కోసం రోజంతా ఎదురు చూశారు కానీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో సాయంత్రం ఏడు గంటల వరకూ ఎదురుచూసి భేటీ నిర్వహించాకుండానే ఇళ్ళకు వెళ్ళిపోయారు. సోమవారం నాటికి అనుమతి రాకపోతే కేబినేట్ మొత్తం ఢిల్లీ కి వెళ్లి ఈసిని కలవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు నేడు అనుమతి లభించడంతో రేపు కేబినేట్ భేటీ జరిగే అవకాశం ఉంది.