Friday, September 20, 2024
HomeTrending Newsఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసి ఆగ్రహం: పిన్నెల్లి అరెస్ట్ కు ఆదేశాలు

ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసి ఆగ్రహం: పిన్నెల్లి అరెస్ట్ కు ఆదేశాలు

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం  తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈ సాయంత్రం ఐదు గంటలలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను ఆదేశించింది.

మే 13 న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలో పాల్వా గేట్ పోలింగ్ కేంద్రం(202)లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ను స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేలకేసి కొట్టిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డట్లు కేసు నమోదైంది. కాగా నిన్న సాయంత్రం నుంచి ఈ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే ఈవీఎం ద్వంసం చేసినట్లు ఆధారాలున్నా ఎందుకు ఫిర్యాదు చేయలేదని.. ఈ ఘటనను కప్పిపుచ్చిన ఎన్నికల సిబ్బంది తోపాటు ప్రిసైడింగ్ అధికారిపై కూడా కేసులు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసున్నాయి.

మరోవైపు ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారికి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయనకు నోటీసు జారీ చేసింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యే యేనా? ఒకవేళ ఉన్నది ఆయనే అయితే ఇంతవరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని  ప్రశ్నించింది. వెంటనే కేసు పెట్టి పిన్నెల్లిని అరెస్టు చేయాలని డిజిపిని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లి సోదరులను అదుపులో తీసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది.

పీఅర్కే ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో మాచర్ల పట్టణంతో పాటు సమస్యాత్మక గ్రామాల్లో భద్రత పెంచారు. ప్రత్యేక కేంద్ర బలగాలను కూడా రప్పిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్