ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తన కింది అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే రిలీవ్ కావాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికలకు సంబంధం ఉన్న ఎలాంటి విధులూ అప్పగించవద్దని, , కొత్త డిజిపి నియామకంకోసం మూడు పేర్లతో ఓ ప్యానెల్ ను సోమవారం, మే 6 వ తేదీ ఉదయం 11 గంటల్లోగా సూచించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డిజిపి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, అధికార పార్టీ నేతలు విపక్షాలపై దాడులకు పాల్పడినా వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని, డిజిపి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్నారని టిడిపి, జనసేన, బిజెపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
నిన్న మాడుగుల నియోజకవర్గంలో అనకాపల్లి బిజెపి ఎంపి అభ్యర్ధి సిఎం రమేష్- వైసీపీ అభ్యర్ధి బూడి ముత్యాల నాయుడు వర్గాల మధ్య జరిగిన ఘటనపై కూడా విపక్షాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఈసీ దృష్టికి తీసుకు వెళ్ళింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు డిజిపిపై చర్యలు తీసుకుంది.