Manifesto: రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించే విషయంపై , ఆ హామీలు అమలు చేయలేకపోతే చర్యలు తీసుకునే అంశపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో నేతలు వినియోగిస్తున్న భాష ఆందోళన కలిగిస్తోందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను, పూర్వీకులను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్య ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో వెంకయ్య మాటాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ అంటే పిన్నమనేని కోటేశ్వర రావే గుర్తుకు వస్తారని, నమ్మిన పార్టీకి, సిద్ధంతానికి తుదివరకూ కట్టుబడి ఉన్నారని కొనియాడారు. రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతున్న ఈ తరుణంలో అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని నేతలు ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తే వారు ఎలా పాలిస్తారో చేసి చూపిన వ్యక్తి అని, ఆదర్శ ప్రజా నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉన్న గొప్ప మనిషి పిన్నమనేని అని వెంకయ్య ప్రసంశించారు. ఆయన కట్టు, బొట్టు, మాటతీరు, వ్యవహార శైలి నిక్కచ్చిగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఒక మాజీ జడ్పీ చైర్మన్ విగ్రహావిష్కరణకు వెళ్ళాలా అని తన కార్యాలయ అధికారులు సందేహించగా, ఆయన మామూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ కాదని వారికి చెప్పి తప్పకుండా ఈ కార్యక్రమానికి వెళ్ళాల్సిందేనని స్పష్టంగా వారికి చెప్పానన్నారు.
ప్రజా జీవితంలో ఉన్నవారు ప్రతిరోజూ సాయంత్రం పడుకునే ముందు ఒకసారి ఆలోచించువాలని, ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కులం మన చేతిలో ఉండేది కాదని, కానీ కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం పెరిగిపోవడం మంచిది కాదన్నారు. కులము కన్నా గుణము నిన్న అని, అయన గుణాన్ని చూసే పిన్నమనేనిని ఇప్పటివరకూ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పారు. 1972వ సంవత్సరంలో జై ఆంధ్రా ఉద్యమ సమయంలో మచిలీపట్నం లో పర్యటించిన విషయాలను వెంకయ్య నెమరువేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్,మాజీ మంత్రులు పేర్ని నాని, పిన్నమనేని వెంకటేశ్వర రావు, విప్ సామినేని ఉదయభాను, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Also Read : తెలుగు భాష కళ్ళలాంటిది: వెంకయ్యనాయుడు