Sunday, January 19, 2025
HomeTrending Newsఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు: అశోక్ బాబు

ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు: అశోక్ బాబు

Return Gift: అనివార్య పరిస్థితుల్లోనే  ఉద్యోగస్తులు సమ్మె చేస్తారని,  సమ్మె కొత్త కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో మాజీ నేత పరుచూరి అశోక్ బాబు అన్నారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించారని ఆరోపించారు. ఎర్ర జెండా వెనుక పచ్చ  జెండా ఉందని సిఎం మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వం ఆ నలుగురు ఉద్యోగ సంఘాల నేతలతో ఒప్పదం చేసుకుందని, అందుకే  ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూన్ని జేఏసి నుంచి బైటకు వస్తున్నాయని, వారు విడిగా మరో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమానికి సిద్ధం అవుతున్నారని  వెల్లడించారు.  27 శాతం ఐఆర్ ఇచ్చి , ఫిట్ మెంట్  23 శాతానికి మించి ఇవ్వబోమని, అది ముగిసిన అధ్యాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉద్యోగులను  ఒకరకంగా బెదిరించారని చెప్పారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగా లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధమని, దేశంలోనే అత్యధిక ఆదాయం వస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటని, డిసెంబర్ , 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 97,887 కోట్ల రూపాయలు ఉందని, ఈ విషయాన్ని కాగ్ చెప్పిందని, మార్చి లోగా ఈ ఆదాయం ఒక లక్షా 32 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అశోక్ బాబు వివరించారు.

ఉద్యోగ సంఘాల నేతలు నలుగురు చేతగాని వాళ్ళుగా అశోక్ బాబు అభివర్ణించారు. అందుకే వారిని బెదిరించి ఉద్యోగులందరినీ మోసం చేశారని, మాట తప్పారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం 86, 308 కోట్ల రూపాయలని, అందులోనూ 15 వేల కోట్ల లోటు బడ్జెట్ లో రాష్ట్రం ఉందని  విశ్లేషించారు.

రాబోయే కాలంలో ప్రభుత్వంపై ఉద్యోగస్తులు తిరగబడతారని, అవసరమైతే తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని అశోక్ బాబు ప్రకటించారు. ఇప్పటికైనా  చేసిన తప్పును జగన్ ప్రభుత్వం సరిచేసుకోవాలని, లేకపోతే ఉద్యోగస్తులు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని హెచ్చరించారు.

Also Read : ఎదుట ఎర్ర జెండా-  వెనక పచ్చ అజెండా:  సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్