Friday, September 20, 2024
HomeTrending NewsNizam College: ఓయూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - మంత్రి కేటిఆర్

Nizam College: ఓయూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – మంత్రి కేటిఆర్

నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు. కాలేజీకి గొప్ప పేరుందన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు తాను నిజాం కాలేజీలో చదువుకున్నట్లు గొప్పగా చెబుతానని వెల్లడించారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బాయ్స్‌ హాస్టల్‌, న్యూ కాలేజీ బ్లాక్‌కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. యూనివర్సిటీల పరంగా తెలంగాణకు నాలుగవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఓయూ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు. వర్సిటీ వీసీ రవీందర్ కూడా ఓయూ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందన్నారు. తెలంగాణ టీశాట్‌తో (TSAT) కలిసి ఉస్మానియా టీవీ ఏర్పాటు చేయడం ద్వారా మారుతున్న పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యను మరింతమందికి అందించేలా ప్రయత్నం చేయడం స్వాగతించదగిన విషయమని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. నిజాం కాలేజీ కోసం నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ఆయన కూడా నిజాం కాలేజీ విద్యార్థేనని గుర్తుచేశారు.

గతంలో ఈ కాలేజీలో డిగ్రీ చదువుతున్న బాలికలకు హాస్టల్ వసతి లేకపోవడంతో వెంటనే నిర్మాణం చేసి, ప్రారంభించుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విద్యాశాఖకు నిధులకు అదనంగా పురపాలక శాఖలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.40.75 కోట్లు ఇచ్చామన్నారు. నేడు బాయ్స్ హాస్టల్‌తోపాటు అదనపు తరగతి గదులను నిర్మించుకోబోతున్నామని తెలిపారు. వచ్చే 15 నెలల్లో భవనాల నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. కాలేజీ గ్రౌండ్‌కు ఇబ్బంది రాకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్