మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం తరఫున ప్రత్యేక దూతతో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హడావిడిగా హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది.
మొయినాబాద్ లో బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన ఫాంహౌస్ లో జరుతుగున్న ఈ రహస్య సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణతో పాటు రాష్ట్ర బిజెపి నేతలు మరికొద్దిమంది పాల్గొన్నారు. ఈ భేటికి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా హాజరైనట్లు సమాచారం అందుతోంది.
ఈ సమావేశం వివరాలు ముందే బైటకు రాకుండా కిషన్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈటెల చేరికకు బిజెపి కేంద్ర నాయకత్వం తో పాటు రాష్ట్ర నేతలు కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలియవచ్చింది.
మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత సొంతంగా పార్టీ పెట్టాలా లేక ఏదైనా జాతీయ పార్టిలో చేరాలా అనే అంశంపై ఈటెల గత కొద్దిరోజులుగా మల్ల గులాలు పడుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను కూడా అయన కలుసుకున్నారు. కాంగ్రెస్ లో ఈటెల చేరిక లాంఛనమే అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ బిజెపి నేతలు రంగంలోకి దిగి ఈటెలను తమ పార్టీలో చేర్చుకునేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. మధ్యాహ్నానికి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.