కొంతమంది వ్యక్తులు తొత్తులుగా, బానిసలుగా మారిపోయి తనపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని అలాంటి వారికి ఖబడ్దార్ అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ప్రగతి భవన్ ఇచ్చిన రాతలు పట్టుకొని తనపై నిందలు మోపితే రాజకీయంగా బొంద పెడతామన్నారు. హుజురాబాద్ లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని, ఈ సంగ్రామంలో తెలంగాణా ఆత్మ గౌరవ బావుటా ఎగురవేస్తామని రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా ప్రకటించిన తర్వాత మొదటి సారి కమలాపూర్ కి వచ్చిన ఈటెల కు అభిమానులు భారీ స్వగతం పలికారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.
బ్లాక్ మెయిల్ చేసి, దాడులు చేసి, కొంత మంది నేతలను డబ్బుతో కొనాలని చూస్తున్నారని, కానీ ప్రజలను కొనడం మాత్రం సాధ్యపడదని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కెసియార్ కు తగిన బుద్ధి చెబుతామని ఈటెల హెచ్చరించారు. తెలంగాణా ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువైతే, కరీంనగర్ ను కాపాడుకున్న నియోజకవర్గం నాటి కమలాపూర్, నేటి హుజురాబాద్ అన్నారు.
తన గురించి మాట్లాడే వారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. గొర్రెల మందలపై తోడేళ్ళు దాడి చేసినట్లు చేస్తున్నారన్నారు. పులి బిడ్డల్లా యువకులు సిద్ధంగా ఉన్నారని, ధర్మానిదే విజయమని వ్యాఖానించారు.
కౌరవులకు పాండవులకి మధ్య యుద్ధం జరగనుందని, 20 ఏళ్ళపాటు ఉద్యమంలో కలిసి నడిచిన వారు, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత భంగపడ్డ వారు ఈ ఉప ఎన్నికల్లో ఇక్కడ పని చేయబోతున్నారని, హుజురాబాద్ క్షేత్రంలో వారి సత్తా చాటుతారని చెప్పారు. పిడికెడు మంది అబద్ధాల కోరులు ఎప్పటికీ విజయం సాధించలేరని, తెలంగాణా ఆత్మా గౌరవ బావుటా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.