మాజీ మంత్రి ఈటల రాజేందర్ వరుస రాజకీయ సమావేశాలతో బిజీగా వున్నారు. నేడు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తో ఈటల సమావేశమయ్యారు. గంటన్నరకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ సమయంలో అక్కడికి వచ్చిన డీఎస్ కుమారుడు, బీజేపీ ఎంపీ అరవింద్ ను కూడా ఈటల కలిసి మాట్లాడారు.
కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలను, ప్రజా సంఘాల నేతలను ఈటెల కలుస్తున్నారు. మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలను కలుసుకున్నారు. బిజెపి జాతీయ నాయకురాలు డి కె అరుణ, కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్, కోదండ రాం, తీన్మార్ మల్లన్న తదితరులను కలుసుకున్నారు.
అసైన్డ్, దేవాలయాల భూములు ఆక్రమిచారంటూ రాజేందర్ ను మంత్రిపదవి నుంచి కెసియార్ తప్పించిన సంగతి విదితమే. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఈటల మల్లగుల్లా పడుతున్నారు. సొంత పార్టీ పెట్టాలా, ఏదైనా జాతీయ పార్టిలో చేరాలా అనేదానిపై తేల్చుకోలేకపోతున్నారు.
త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని, తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.