Saturday, January 18, 2025
HomeTrending Newsరేపు రాజీనామా, 14 బిజెపిలో చేరిక

రేపు రాజీనామా, 14 బిజెపిలో చేరిక

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈనెల 14న భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. రేపు ఉదయం తన శాసన సభ్యత్వానికి ఈటెల రాజీనామా చేయనున్నారు. తొలుత గన్ పార్క్ లోని అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం శాసనసభ కార్యదర్శిని కలిసి రాజీనామా సమర్పిస్తారు.

బిజెపి రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, బిజెపి ముఖ్య నేతలు డి కే అరుణ, విజయశాంతి, వివేక్, ఇంద్రసేనా రెడ్డి, రామచంద్ర రావు, పార్టీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు తదితరులు శామీర్ పేట లోని ఈటెల నివాసంలో లంచ్ కు హాజరయ్యారు. రేపు రాజీనామా చేస్తున్న సందర్భంగా బిజెపి అగ్ర నేతలు రాజేందర్ కు సంఘీభావం తెలిపారు. బిజెపిలో ఈటెలకు తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ లంచ్ మీటింగ్ లో పాల్గొనాల్సి ఉంది, అయితే తన గన్ మాన్ కు కరోనా సోకడంతో సంజయ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

14వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఈటెల బిజెపి సభ్యత్వం స్వీకరించనున్నారు. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ కూడా బిజెపిలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నేతలు కూడా పలువురు పాల్గొంటారు.

తెలంగాణా రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన తర్వాత రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటించిన రాజేందర్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అన్ని వర్గాల నుంచి ఆయనకు సంఘీభావం లభించింది. ఈ స్ఫూర్తితో వీలైంత త్వరలో రాజకీయంగా పావులు కదిపెందుకే అయన మొగ్గుచూపారు. త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేసే ఆలోచనలో ఈటెల ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్