Friday, March 20, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుస్తకము చేతన్ పూనితిమి...

పుస్తకము చేతన్ పూనితిమి…

పుస్తకాలు కేవలం కట్టకట్టిన కాగితాలు కాదు- మన కళ్లు చూడలేని ప్రపంచాలను చూపించే అద్భుత దీపాలు.
జీవితం చీకట్లో కూరుకుపోయి ఉన్నప్పుడు పుస్తకం మన చేయి పట్టుకుని వెలుగువైపు నడిపిస్తుంది. మనం ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పుడు ఆ నిశ్శబ్దంలో మనతో మాట్లాడే ప్రాణ స్నేహితుడు పుస్తకం.

మనం ఎప్పుడూ వెళ్లలేని ప్రదేశాలకు, మనం ఎప్పటికీ కలవలేని గొప్ప వ్యక్తుల ఆలోచనలకు పుస్తకాలు వారధులు. ఒక మంచి పుస్తకం చదవడమంటే… మరొకరి అనుభవాన్ని మన పాఠంగా మార్చుకోవడం. ఓటమిలో ధైర్యాన్ని, బాధలో ఓదార్పుని, అయోమయంలో స్పష్టతను ఇచ్చే శక్తి కేవలం అక్షరానికే ఉంది. మనం చదివే ప్రతి పేజీ మనలోని అజ్ఞానాన్ని తొలగించి, కొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తుంది. పుస్తకాలు మనల్ని కేవలం తెలివైన వారిగా మాత్రమే కాదు, ఎదుటివారి బాధను అర్థం చేసుకునే సహృదయులుగా మారుస్తాయి. కాగితం మీద అక్షరం మన మనసు మీద సంతకం చేస్తే…ఆ జీవితం ఎప్పటికీ వెలిగిపోతూనే ఉంటుంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం జాతీయ పుస్తక ప్రదర్శన కోలాహలంగా సాగుతోంది. పుస్తక ప్రేమికులకు ఇదొక పండుగ. నేను కూడా వెళ్లాలి. కొనాల్సిన పుస్తకాలు జాబితాలో చాలానే ఉన్నాయి. కానీ నా ఇంట్లో, ఆఫీసు అల్మారాల్లో నిశ్శబ్దంగా కొలువుదీరిన పుస్తకాలు నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. అవి నన్ను వెక్కిరిస్తున్నట్లు ఉంటుంది. అందుకే ఈ మధ్య పుస్తకాలు కొనడం బాగా తగ్గించాను.

నా ఆఫీసు గది ఇప్పుడు ఒక చిన్నపాటి గ్రంథాలయం. అందులో ఉన్నవన్నీ నేను కొన్నవి కావు. కొన్ని కాలం ఇచ్చిన కానుకలు, మరికొన్ని పెద్దలు అందించిన ఆశీస్సులు. మహాకవి, సర్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారి కుమార్తె నాగపద్మిని గారిలాంటి పెద్దలు నాపై అభిమానంతో పంపిన అపురూప గ్రంథాలు ఒకవైపు ఉంటే, మా నాన్న నాకు వారసత్వ ఆస్తిగా ఇచ్చి వెళ్ళిన జ్ఞాననిధి మరోవైపు ఉంది.

మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య అరవై ఏళ్ల పాటు పుస్తకాలను ప్రాణప్రదంగా కాపాడుకున్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన తిరుపతిలో స్థిరపడ్డారు. ఆయన తుదిశ్వాస విడిచినప్పుడు ఆయన భద్రంగా దాచుకున్న అయిదు వేల పుస్తకాలను ఏం చేయాలో తెలియలేదు. వాటిలో నా స్థాయికి చదవలేను అనుకున్న మూడు వేల పుస్తకాలను నాన్న చదువుకున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఆయన గుర్తుగా బహుమతిగా ఇచ్చాను. మిగిలిన పుస్తకాలను నావెంట తెచ్చుకున్నాను. నా గ్రంథాలయంలో 80 శాతం పుస్తకాలు మా నాన్నవి, కొన్ని మా తాతవి. అవి కేవలం పుస్తకాలు కావు, మూడు తరాల వారసత్వ నిధి.

గత ముప్పయ్యేళ్లలో నా దగ్గరున్న పుస్తకాల్లో నేను పూర్తిస్థాయిలో చదివింది మహా అయితే మూడు, నాలుగు వందలు ఉండవచ్చు. మిగిలినవి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెరిచే ‘రెఫరెన్స్’ గ్రంథాలు. కొన్నిటిలో ఒక్క పేజీ, మరికొన్నిటిలో ఒక్క లైను మాత్రమే చదివి ఉంటాను. నిజం చెప్పాలంటే నా జీవితకాలంలో చదివి తీరాలనుకున్న పుస్తకాల్లో పాతిక శాతం కూడా పూర్తి కాలేదు. నా ప్రస్తుత వయసు, నాకున్న ఇతర వ్యాపకాలు, బాధ్యతలను బట్టి చూస్తే.. ఇకముందు కూడా ఆ అల్మారాల్లో ఉన్నవన్నీ చదవగలననే నమ్మకం లేదు, అలా చదవాలనే పట్టుదలా లేదు. ఎందుకంటే, పుస్తకం చదవకపోయినా దాని సారాన్ని ఎలా ఒంటబట్టించుకోవాలో నేర్పిన ఇద్దరు ‘నడిచే గ్రంథాలయాలు’ నా జీవితంలో ఉన్నారు. ఒకరు మా నాన్న, రెండో వ్యక్తి నాకు జర్నలిజంలో తెలుగు పాఠాలు నేర్పిన గురువు డి. చంద్రశేఖర్ రెడ్డి గారు. పుస్తకాన్ని వెతకాల్సిన అవసరం లేకుండా ఏ సందేహం వచ్చినా నివృత్తి చేయగల అక్షర భాండాగారాలు వారు. పుస్తకం అల్మారాలో అలాగే ఉన్నా దాని జ్ఞానం మన మెదడులోకి నిరంతరం ఎలా ప్రవహింపజేయాలో వారికి తెలుసు.

ఈ రోజుల్లో డిజిటల్ పుస్తకాల (e-books) హడావిడి పెరిగినప్పటికీ ముద్రిత కాగితం పుస్తకాల(Printed Books) అవసరమే ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణాలు:-

  1. కంటి ఆరోగ్యం: ఫోన్‌లు లేదా ట్యాబ్‌ల స్క్రీన్‌లను చూస్తూ చదవడం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. ముద్రిత పుస్తకాలు కంటికి ఎటువంటి హాని చేయవు.
  2. ఏకాగ్రత: డిజిటల్ పరికరాల్లో చదివేటప్పుడు నోటిఫికేషన్లు, మెసేజ్‌లు మన దృష్టిని మళ్ళిస్తాయి. కానీ పుస్తకం చదివేటప్పుడు పూర్తి ఏకాగ్రత ఉంటుంది.
  3. జ్ఞాపకశక్తి: పరిశోధనల ప్రకారం, డిజిటల్ స్క్రీన్ల కంటే కాగితం మీద ఉన్న అక్షరాలను చదివినప్పుడే విషయాన్ని మెరుగ్గా గుర్తుంచుకోగలమని తేలింది.
  4. అనుభూతి: పుస్తకాన్ని చేత్తో పట్టుకోవడం, ఆ కాగితం వాసన, పేజీలను తిప్పేటప్పుడు కలిగే అనుభూతి డిజిటల్ పుస్తకాల్లో ఎప్పటికీ లభించదు. డిజిటల్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా…పుస్తకం పుస్తకమే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular