భారత్‌లో వినోద రంగం ముఖచిత్రం వేగంగా మారుతోంది. గతంలో గంటల తరబడి టీవీల ముందు కూర్చునే ప్రేక్షకులు ఇప్పుడు తమ అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే అద్భుతమైన కథలను ఆస్వాదిస్తున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణం ‘మైక్రో డ్రామా (Micro-Drama)’ విప్లవం. భారతదేశంలో ఈ సరికొత్త వినోద సాధనం ఒక ప్రభంజనంలా మారింది.
నిమిషాల వినోదం.. కోట్లల్లో వ్యాపారం:-
నేటి కాలంలో మనిషికి తీరిక దొరకడం కష్టంగా మారింది. ఆఫీసు విరామాల్లో, ప్రయాణాల్లో లేదా పడుకునే ముందు కొద్దిసేపు ఏదైనా చూడాలనుకునే వారికి ‘మైక్రో డ్రామాలు’ వరంగా మారాయి. ఒకటి, రెండు నిమిషాల నిడివిగల ఎపిసోడ్లు, ఉత్కంఠభరితమైన ముగింపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. భారత్‌లో ఈ మైక్రో డ్రామా యాప్‌ల డౌన్‌లోడ్లు దాదాపు 10 కోట్లు దాటడం ఈ వినోద సాధనం పట్ల పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనం.
మారుతున్న ట్రెండ్స్:-
గతంలో వినోదం అంటే పెద్ద స్క్రీన్ లేదా సినిమా థియేటర్ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ‘వర్టికల్ వీడియో’ (Vertical Video) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఒకప్పుడు కేవలం ఫన్నీ క్లిప్స్, రీల్స్‌కే పరిమితమైన ఈ ఫార్మాట్ ఇప్పుడు పూర్తి స్థాయి కథా చిత్రాలకు వేదికైంది.
- క్షణం తీరిక లేని జీవితం:-69% మంది ప్రేక్షకులు సాయంత్రం విశ్రాంతి సమయంలో వీటిని చూస్తుండగా, 55% మంది పని లేదా చదువు మధ్యలో దొరికే చిన్న విరామాల్లో వీక్షిస్తున్నారు.
- ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం:-కేవలం హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, బెంగాలీలాంటి భాషల్లో వస్తున్న కథలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 65% మంది యువత ఈ తరహా వినోదాన్ని ఎంచుకుంటున్నారు.

వినోద రంగం నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే ఐదేళ్లలో మైక్రో డ్రామా మార్కెట్ విలువ ఒక్క భారత్ లోనే సుమారు 88 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. ఏఐ (AI)లాంటి నూతన సాంకేతికతలు వీటి నిర్మాణ ఖర్చును తగ్గిస్తూ, నాణ్యతను పెంచుతున్నాయి.
కథలను చూసే విధానం మారుతోంది; కథలే మనుషుల వెంటపడే రోజులొచ్చాయి. ఈ మైక్రో డ్రామా విప్లవం కేవలం ఒక ట్రెండ్ కాదు, ఇది వినోద ప్రపంచంలో ఒక నూతన శకం. తక్కువ సమయంలో ఎక్కువ భావోద్వేగాలను పండించే ఈ ‘చిన్న’ వీడియోలు, వినోద పరిశ్రమలో ‘పెద్ద’ మార్పుకు నాంది పలికాయి.

