Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశ్రీనివాస రామానుజన్ కూడా చెప్పలేని వ్యాక్సిన్ లెక్కలు!

శ్రీనివాస రామానుజన్ కూడా చెప్పలేని వ్యాక్సిన్ లెక్కలు!

ఆమధ్య ఒక సినిమాలో ఒక హీరో తనకు తిక్క ఉంది కానీ- ఆ లోకోపకార పైత్య ప్రహర్ష ఉన్మత్త తిక్కకు ఒక లెక్క ఉందని- ప్రాసతో పాటు చెబితే కోట్ల మంది ఒప్పుకున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా తిక్కకు నిజంగానే లెక్కలు ఉంటాయి. కాకపోతే ఆ లెక్కల తూనికలు, కొలతలు ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో మాత్రమే అవగాహనకు అందుతాయి. తిక్కను కొలిచే లెక్కలను తిక్క లెక్కలు అని సమాసం చేయాలి. లెక్కలకు తిక్క విశేషణ పూర్వపద కర్మధారయ కాకూడదు. అలా అయితే లెక్కలే తిక్కవవుతాయి. తిక్క లెక్కకు అందదు కాబట్టి పిచ్చిమాలోకం అని స్థూలంగా అనుకుని వదిలేస్తాం. వేపకాయంత వెర్రి పర్మిసబుల్. ఇన్ బిల్ట్ గా బ్రహ్మ ఎంతో కొంత తిక్కను మెదడులో నిక్షిప్తం చేసే సృష్టిస్తాడట. బహుశా ఆయన మ్యానుఫ్యాక్చురింగ్ మ్యాన్యువల్ లో అలా ఉండి ఉంటుంది. ఇంతకంటే తిక్క పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళితే తిక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. అయినా మన గొడవ తిక్క గురించి కానే కాదు. లెక్కల్లో తిక్క గురించి. అప్పుడు సమాసం లెక్కల తిక్క అవుతుంది.

కరోనాకు గుడ్డిలో మెల్లలా మెల్లగా వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ ఎంతమందికి అవసరం? రెండు డోసుల చొప్పున ఎన్ని రోజుల్లో ఎన్నెన్ని డోసులు ఎక్కడెక్కడికి పంపాలి? మొదటి డోసు వేసుకున్న వారెందరు? రెండు డోసులు అయిన వారెందరు? ప్రభుత్వం వేసిన డోసులెన్ని? ప్రయివేటు పొడిచిన డోసులెన్ని? 15 -45 ఏళ్ల వారికి ఎప్పుడు వేస్తారు? మొదటి డోసు అయి రెండో డోసు దొరకక దేశాలు పట్టుకుని తిరుగుతున్నవారు ఎంత మంది? యాప్ లో ఎన్రోల్ చేసుకున్నవారే వ్యాక్సిన్ కు అర్హులా? లేకపోయినా వేస్తారా? పొరుగు దేశాలకు ఔదార్యంగా, ఉచితంగా , అర్జంటుగా పంపిన భారత్ దానశీల డోసులు ఎన్ని కోట్లు? బయట పల్లకీ మోతకోసం ఇంట్లో ఈగల మోతగా మిగిలిన డోసులెన్ని? రెండో డోసు నాలుగు నుండి ఆరు వారాల్లోపు వేసుకోకపోతే- మళ్లీ మొదటి డోసుతో ఓనమాలు దిద్దుకోవాలా? అలాంటి వ్యాక్సిన్ నిరక్షరాస్యులయిన వయోజనులకు మళ్లీ బళ్లు పెట్టి ఎప్పుడు వ్యాక్సిన్ అక్షరాలు దిద్దిస్తారు? సువిశాల భారత్ మొత్తానికి వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తవ్వడానికి ఎన్ని యుగాలు పడుతుంది? రెండు మూడు నెలల్లో అన్ని డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తికి నిజంగా అవకాశం ఉందా? ఉంటే ఆ ఖర్చు ఎన్ని లక్షల కోట్లు? ఆ ఖర్చును కేంద్రం భరిస్తుందా? రాష్ట్రాలు భరిస్తాయా?

ఇంకా చాలా లెక్కల తిక్క ప్రశ్నలున్నాయి కానీ- పాఠకుల మానసిక ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఇక్కడికి ఆపేద్దాం. రెండు చేతులు కొట్టిన చప్పట్లు డివైడెడ్ బై కంచాల మీద గరిటెల దెబ్బలు ఇంటూ ఆరిన కొవ్వొత్తులు మైనస్ పోయిన ప్రాణాలు ఈజ్ ఈక్వల్ టు మిగిలిన ప్రాణాలు ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వయిర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వయిర్ ప్లస్ బి స్క్వయిర్ ప్లస్ టు ఏ బి. ఇంకా అర్థం కాకపొతే ఏ మైనస్ బి హోల్ స్క్వయిర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వయిర్ ప్లస్ బి స్క్వయిర్ మైనస్ టు ఏ బి. అయినా అర్థం కాకపొతే నన్ను మన్నించండి. నేను లెక్కల్లో చాలా పూర్. లెక్కలు వేరు. వాస్తవాలు వేరు. వాస్తవానికి ప్రాణాలు ఇప్పుడు లెక్కల్లో కూడా మిగలడం లేదు.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్