-1.4 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంయాభై ఏళ్ల కిందటి దీపావళి

యాభై ఏళ్ల కిందటి దీపావళి

Searching of Light:
మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంపత్
ప్రతతులతి క్షణికంబులు
గత కాలము మేలు- వచ్చు కాలము కంటెన్”

కవిత్రయ తెలుగు భారతంలో మన ఆదికవి నన్నయ పద్యమిది. భారత, భాగవతాల్లో ఉన్న ఎన్నెన్నో పద్య పాదాలు, వాగ్గేయకారుల కీర్తనల్లో పల్లవులు, చరణాలు, నీతి శతకాల్లో మంచి మాటలు తెలుగు వాడుక మాటలయ్యాయి. అలా ఈ పద్యం చివరి పాదం “గత కాలము మేలు- వచ్చు కాలము కంటెన్” నిత్యవ్యవహారంలో వాడదగ్గ మాట అయ్యింది.

ఇప్పుడు డిజిటల్ దీపావళులు, వర్చువల్ వెలుగులు, ఆన్ లైన్ అమావాస్య, నరక చతుర్దశులు…నూనె లేని, ఒత్తుల్లేని, ప్రమిదలే లేని విద్యుత్ దీపాల వరుసలు ఇంకా ఎన్నెన్నో వచ్చాయి కానీ…యాభై ఏళ్లు వెనక్కు వెళ్లి మా చిన్నతనంలో దీపావళిని తలచుకుంటే- గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని అనిపిస్తుంది.

హిందూపురానికి శివకాశి నుండి పటాకులు వస్తే…హిందూపురం నుండి లేపాక్షి సూరణ్ణ అంగడికి వస్తాయి. దీపావళికి రెండు, మూడు రోజుల ముందే విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణులు రాక్షససంహారానికి ఉత్సాహంగా వెళ్లినట్లు చేతిలో సంచులు ధరించి పిల్లలందరం తండ్రుల వెంట పటాకులు కొనుక్కోవడానికి పరమోత్సాహంగా వెళ్లేవాళ్లం.

తుపాకి, అందులో రీల్ మస్ట్. హై స్కూల్ వయసు, ఆపై వారికి మాత్రమే లక్ష్మీ పటాకులు, ఆటం బాంబులు, రాకెట్లు అని అలిఖిత నియమాన్ని తప్పకుండా పాటించేవాళ్లం. అయిదుగురు పిల్లలు గంపెడు పటాకులు కొన్నా వంద రూపాయలు దాటేది కాదు.

తెచ్చుకున్న పటాకులను ఎండలో బాగా ఆరబెట్టడానికి చాటల్లో ఎవరివి వారు పంచుకునేవాళ్లం. నరక చతుర్దశి, దీపావళి, అమావాస్య మూడు రోజులకు పటాకులను వేరు చేసుకోవడం చాలా పెద్ద పని. రాకెట్లు కాల్చడానికి ఖాళీ సీసాలో మట్టి పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడంటే ఖాళీ బీర్ బాటిళ్లు చెయ్యి పెట్టిన చోటల్లా దొరుకుతున్నాయి కానీ…దీపావళికి ముందు ఒక ఖాళీ సీసా సంపాదించడానికి మా క్లాస్ మేట్ సునీల్ గాడి సాయం అవసరమయ్యేది. వాళ్ళ నాన్న ఆసుపత్రిలో కాంపౌండర్. అతికష్టం మీద వాడి పారేసిన మందు బాటిల్ దొరకబుచ్చుకుని...స్నేహధర్మం కొద్దీ తెచ్చి ఇచ్చేవాడు. అగ్గిపెట్టెలా ఉండే విమానం పటాకును కాల్చడానికి రెండు కొమ్మల మధ్యో, రెండు స్తంభాల మధ్యో ఒక తాడు కట్టడం అంటే మాటలా? చేతిలో విష్ణు చక్రం కాల్చడమంటే ఆ శ్రీహరి తరువాత విష్ణుచక్రాన్ని చేతబట్టింది మనమే కదా? భూచక్రంతో భూమికి వెలుగుల ముగ్గులు వేసింది మనమే కదా? కాలి…కరిగిన వెన్న ముద్దలెన్ని? బుస్సుమని పొంగి…బూడిద కుబుసం వదిలిన పాము బిళ్ళలెన్ని? కాల్చి పారేసిన కాకారపువ్వొత్తులెన్ని? బూడిద చేసిన చిచ్చు బుడ్లు ఎన్ని? శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగానికి ముందు ఏర్పాట్లకంటే మా దీపావళి ఏర్పాట్లు ఏమాత్రం తక్కువగా ఉండేవి కావు.

మొదటిరోజు ఉదయం ఐదింటికే నిద్రలేపి తలంట్లు పోసి…కొత్త బట్టలు తొడిగి…చీకట్లో ఇంటి ముందు దీపం వెలిగించి…శాస్త్రానికి రెండంటే రెండు పటాకులు కాల్పించేవారు. ఇక అక్కడి నుండి మూడు రోజులపాటు విసుగు విరామం లేకుండా కాలుస్తూనే ఉండేవాళ్లం. రాత్రి ఇంటిముందు కాల్చిన పటాకుల చెత్త ఎవరి ఇంటి ముందు ఎక్కువుందో ఉదయాన్నే ఒక పరిశీలక బృందంగా వెళ్లి తనిఖీలు చేసి వచ్చేవాళ్లం. ఏయే పటాకులు ఎవరెవరు కాల్చారో ! ఏయే శబ్దాలు ఎవరి అకౌంట్లో వేయాలో కమిటీ నిష్పాక్షికంగా ఆధారాలు సేకరించి నిర్ణయించేది.

మా ఎదురింటి టైలర్ ప్రసాద్, అతడి తమ్ముడు ఇద్దరూ ఆటం బాంబులను చేత్తో కాల్చి…సరిగ్గా అది పేలడానికి ముందు గాల్లోకి విసిరేవారు. ఆ విన్యాసం చూడడానికి మాకు ధైర్యం చాలదు. చూడకుండా ఉండనూ లేము. భయం భయంగా కిటికీల్లో నుండి చూసేవాళ్ళం. ఎడమచేత్తో కాలుతున్న అగరొత్తి కొసకు కుడి చేతి బాంబు ఒత్తిని తాకించి…సర్రున ఒత్తి మండుతుండగా ఇంకొంచెం కాలాల్సిన ఒత్తి ఉండగా లీలగా ఆకాశంలోకి విసిరేవారు. అది ఆకాశంలో పేలుతుండగా వారి కళ్ళల్లో ఏవో కాంతులు కనిపించేవి మాకు. ఈ బాంబుల విన్యాసంతో వారు మా బట్టలు వేళకు కుట్టకపోయినా సర్దుకుపోవాల్సి వచ్చేది. రాకెట్లను కూడా చేత్తో కాల్చి…ఆకాశంలోకి వదిలేవారు. పది, పదిహేనేళ్ళల్లో ఒక్కసారి కూడా వారి గురి తప్పలేదు. చిన్న ప్రమాదం కూడా జరగలేదు. దీపావళి తరువాత చాలా రోజులపాటు టైలర్ ప్రసాద్ బాంబులు ఎలా కాల్చాడు? అన్నదే మేము చర్చించుకోవాల్సిన టాపిగ్గా ఉండేది.

ఇప్పుడు-
పండగ పూట సరిగ్గా సాయంత్రం కాల్చడానికి ముందు టెన్ థౌజెండ్ వాలా ఒకటి, హండ్రెడ్ షాట్స్ ఒకటి తెస్తే…పది నిముషాల్లో పాతిక వేలు బూడిద- అంతే.
మరుసటిరోజు పటాకులు పేలి కళ్లు పోయి…సరోజినీ కంటి ఆసుపత్రిలో పెరిగిన రోగుల సంఖ్య వార్తల చీకట్లు. అమావాస్య చీకట్ల ఆకాశానికి జాగ్రత్తగా దీపావళి వెలుగుపూల బాంబులు చల్లిన మా టైలర్ ప్రసాదులు ఎంత గొప్పవారో! మూడు రోజుల దీపావళిలో అలుపు లేకుండా మేము కాల్చిన పటాకులు ఎంత విలువైనవో! ఇప్పుడు బాగా తెలుస్తోంది.

మేము సైతం ప్రపంచ కాలుష్యానికి కంట్రిబ్యూట్ చేసిన పటాకుల సమిధలన్నీ ఇప్పుడు లీలగా గుర్తుకొస్తున్నాయి.

అయినా దీపావళి దీపావళే. వెలుగుల పండుగ. చెడుపై మంచి గెలిచి…నిలిచిన పండుగ.

“అగ్నిధార” కవితాసంపుటిలో కోటిరాతనాల తెలంగాణ వీణ దాశరథి అన్నట్లు-

“భూపావళి బుగ్గి చేసి
కోపావళి నగ్గి ద్రోసి
దీపావళి జరపండో
దేశ దేశ జనులారా!

కోటి కోటి దీపాలను
బాటలలో కోటలలో
నాటండి ప్రజలారా!
వేటాడండి తమస్సును”

కోటి కోటి దీపాలను బాటలలో, కోటలలో, ఇళ్ల గుమ్మాల్లో వెలిగిద్దాం. మన మనసుల్లో, బతుకుల్లో చీకట్లను పారదోలి…దీపావళి వెలుగులను నింపుకుందాం.

దీపావళి శుభాకాంక్షలతో-

పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్