Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

హై స్కూల్ చదువుల్లో పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, ప్రతిపదార్థాలు తప్పనిసరిగా నేర్పుతారు. మనం మార్కుల కోసమే చదివినా…నిజానికి జీవితాంతం ఇవి ఉపయోగపడుతూనే ఉంటాయి. మనసులో భావాన్ని వ్యక్తం చేయడానికి భాషే ప్రధానమయిన మాధ్యమం. ఏడుపు, నవ్వు, అరుపులు, ఎగిరి గంతేయడాలు, కొట్టడం, గిచ్చడం, కొరకడం లాంటి మిగతా భావ వ్యక్తీకరణల గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం.

భాషలో ధ్వని(టోన్) చాలా ప్రధానమని భాషాలంకార శాస్త్రం నిర్వచించింది. ఇక్కడ ధ్వని అంటే శబ్దం(సౌండ్) కాదు.

సులభంగా అర్థం కావడానికి ఉదాహరణ:-

  • ఇంట్లో మీ నాన్న ఉన్నారా?
  • ఇంట్లో నీ అమ్మ మొగుడు ఉన్నాడా?

ఈ రెండు ప్రశ్నల్లో సాంకేతికంగా సంబంధ వాచకంలో తప్పు లేదు. నాన్న గౌరవం. అమ్మ మొగుడు అగౌరవం. ఇక్కడుంది ధ్వని. విడిగా అమ్మ, మొగుడు మాటల్లో నిందార్థం లేదా నీచార్థం లేదు. కొన్ని మాటల కలయికలో, కొన్ని మాటలను ఒత్తి పలకడం వల్ల వేరే అర్థం ధ్వనిస్తుంది.

“భాగవతం” అత్యంత పవిత్రమయినది.
వారి “బాగోతం” అత్యంత నీచమయినది.

వయసులో “పెద్దవారు” మంచివారే.
వాహినీవారి “పెద్ద మనుషులు” అంత మంచివారు కాదు.

చేతులు జోడిస్తే సంస్కారవంతమయిన “దండం”.
మీకో “దండం” అంటే వేరే అర్థం.

“పోయిన” ఏడాది “పైకి” పంపిన ఉపగ్రహం అంటే అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం గురించి.
ఆయన “పైకి” “పోయారు” అంటే ఇక లేరు అని అర్థం.

భాషలో ఉన్న పర్యాయపదాల అర్థం ఒకటే అయినా…వాటి వ్యుత్పత్తి అర్థాల లోతుల్లోకి వెళితే…తేడా తెలిసిపోతుంది. విష్ణువు అంటే అంతా వ్యాపించినవాడు. పద్మనాభుడు అన్నా విష్ణువే. వ్యుత్పత్తి ప్రకారం అర్థం- నాభిలో పద్మం కలిగినవాడు.

ఒకే మాటకు కాలగతిలో అర్థంలో అవ్యాప్తి, అతివ్యాప్తి దోషాలుంటాయి. ఇంతకంటే లోతుగా వెళితే ఇది భాషాశాస్త్ర పాఠమై విషయం అంటరానిదవుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేసి…అసలు విషయంలోకి వెళదాం.

విమోచన
విలీనం
విద్రోహం
సమైక్యత…
ఈ మాటలకు తెలంగాణ గడ్డ మీద ఒక్కసారిగా డిమాండు పెరిగింది. నాలుగూ సంస్కృత పదాలే. ఉపసర్గ “వి” ముందు చేరడంతో విమోచన, విలీనం, విద్రోహం అవుతోంది. అంతకు ముందు వీటి రూపాలు మోచన, లీనం, ద్రోహం అయి ఉంటుంది అనుకుంటే చాలు. అలాగే ఐక్యతకు ముందు “సమ” చేరి సమైక్యత అయ్యింది.

స్థూలంగా ఈ మాటల వ్యుత్పత్తి ప్రకారం:-

విమోచన-
కట్లు తెగిపోయి స్వేచ్ఛ రావడం;

విలీనం-
విడిగా ఉన్నది కలిసిపోవడం;

విద్రోహం-
చాలా పెద్ద ద్రోహం;

సమైక్యత-
సుహృద్భావంతో కలిసిపోవడం

భాషలో ఉన్న పర్యాయపదాలు, అర్థభేదాలు తెలంగాణాలో అధికార, ప్రతిపక్షాలకు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. సెప్టెంబర్ 17 ఒకటే.

ఒకరికి- విమోచన.
ఒకరికి- విలీనం.
ఒకరికి- విద్రోహం.
ఒకరికి- సమైక్యత.

“ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొక్కడై తోచు పో
లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూ
పకుడై యొప్పుచునుండునట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై”

భావం:
ఒకే సూర్యుడు సమస్త జీవులకు వేర్వేరుగా ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్లు కనిపిస్తాడు. ఏ దేవుడు తన అద్భుతమైన లీలలతో, తన నుండి పుట్టిన జీవసమూహాల మనస్సులలో అనేక రూపాలలో ఉంటాడో…అటువంటి దేవుడైన శ్రీకృష్ణుడిని నేను మంచిమనసుతో ప్రార్థిస్తాను అని మన ఓరుగల్లు పోతన దాదాపు ఆరు శతాబ్దాల క్రితం చెప్పిన మాట.

Integration

అలా ఒకే తెలంగాణా ఒక్కొక్క పార్టీకి ఒక్కోలా పుట్టినట్లు కనిపిస్తోంది. ఎలా కనిపించినా…పుట్టి పెరుగుతున్న తెలంగాణ సమైక్యతకు తూట్లు పొడవకుండా ఉత్సవాలు జరుపుకుంటే…చాలు…అదే పది వేలు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

‘బీఆర్ఎస్’ ముహూర్తం ఫిక్స్

Also Read :

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవనం ఆసక్తికరం

 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com