మాదక ద్రవ్యాలు, మద్యపానీయాలు యుగయుగాలుగా ఉన్నాయి. త్రేతాయుగంలో నేలకు అనకుండా గాల్లో తేలుతూ ఉండే రావణాసురుడి పుష్పక విమాన సువిశాల సౌధం బార్ కౌంటర్లో ఎన్ని రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉండేవో లెక్కే లేదు. సురాపానానికి ఒక ఉదాత్తతను ఆపాదించిన కథలు కోకొల్లలు.
ఇప్పటి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సీరీస్…అన్నిట్లో “మద్యం ఆరోగ్యానికి హానికరం” అన్న స్టాచుటరీ హెచ్చరిక సాక్షిగా మద్యం ఏరులై పారుతూనే ఉంటుంది. చిన్నా పెద్ద, రాజు పేద, స్త్రీపురుష భేదం లేకుండా ఇప్పుడు సమాజం తాగడంలో సమానత్వాన్ని సాధించింది. ఇదొక మహా మద్యోదయం. ఇదొక మత్తోదయం.
ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మంచి నీళ్ల బడ్జెట్ కంటే మద్యం మీద ఖర్చు కనీసం మూడు, నాలుగు రెట్లు అధికం. కొన్ని రాష్ట్రాలకు మద్యమే ప్రధానమయిన ఆదాయ వనరు. ఇందులో మంచి చెడ్డల గురించి మాట్లాడ్డం దండగ. మద్యం దానికదిగా ఒక పండగ.
మహా నగరాల్లో పగలూ రాత్రి తాగేవారు తాగుతూ ఊగుతూ జోగుతూనే ఉంటారు. తాగి నడిపి ప్రమాదాలు చేసేవారు చేస్తూనే ఉంటారు. మధ్యలో అమాయకులు పోయేవారు పోతూనే ఉంటారు. ఉండేవారు తాగేవారు పెట్టే బాధలు భరించలేక ఎప్పుడు పోతారో తెలియక ఉంటూ ఉంటారు.
బాధలు మరచిపోవడానికి తాగేవారు;
బాధ పెట్టడానికి తాగేవారు;
బాధపడడానికి తాగేవారు;
ఆనందం పట్టలేక తాగేవారు;
ఆనందం కోసం తాగేవారు;
మర్యాద కోసం తాగేవారు;
మర్యాదగా తాగేవారు;
అమర్యాదగా తాగేవారు;
ఏమీ తోచక తాగేవారు;
వ్యసనంగా తాగేవారు;
ఎందుకు తాగుతున్నారో తెలియక తాగేవారు…ఇలా ఈ లిస్ట్ కు అంతులేదు. వీకెండ్ తాగకపోతే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెను గౌరవించి ఎక్కువ మంది వీకెండే ఎక్కువగా మిక్కిలి మక్కువగా తాగుతూ ఉంటారు.
ఇలా ఇన్ని రకాలుగా, ఇన్నిన్ని సందర్భాలుగా, సందోహాలుగా, సరదాగా, వ్యసనంగా, నానా విధాలుగా, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తాగేవారిని బాధ్యతగల ప్రజా ప్రతినిధి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఏమిటి పుసుక్కున ఇంత మాటనేశారు? “పొద్దుగాల ఈ తాగుడేంది? ఇట్ల తాగితే నీ సంసారమేమి కాను?” అని ఉదయాన్నే ఒక మద్యం దుకాణం ముందు బాధ్యతగా బాటిల్ కొనుక్కుని తాగడానికి వచ్చిన తన నియోజకవర్గ ఓటరైన మందు బాబును ప్రశ్నించారు.
ఇందులో చట్ట ప్రకారం ఆ మందు బాబు చేసిన తప్పు, నేరం ఏమీ లేవు. అతడి బాగు కోరి ప్రజా ప్రతినిధి మంచి- చెడు చెప్పడాన్ని కూడా తప్పుపట్టకూడదు. ప్రభుత్వ నిబంధనల మేరకు నడిచే మద్యం దుకాణాల మీద ఇలా ప్రజా ప్రతినిధులందరూ ఆకస్మిక దాడులు చేసి…ధర్మ సూత్రాలు, నైతిక విలువలు, ఆరోగ్య రహస్యాలు, ఆర్థిక కష్టాల గురించి ప్రవచనాలు మొదలుపెడితే ఇక తాగేదెవరు? ప్రజలు తాగకపోతే ప్రభుత్వం నడిచేదెలా?
మనలో మన మాట-
ఈ భూ ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని వద్దనుకుంటుందా?
పొద్దుగాల జనం గ్లాసుల గలగలలతో కళకళలాడుతూనో, విలవిలాడుతూనో తాగితేనే కదా ఖజానా గల్లా పెట్టెలో కాసులు గలగలలాడేది!
మాట వరసకైనా పొద్దుగాల ఈ తాగుడేంది? అని నిరుపేదను మందలించినందుకు రాజగోపాలరెడ్డిని అభినందించాలి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు