Wednesday, January 22, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఐస్ ల్యాండ్ అగ్ని పర్వత పర్యాటకం

ఐస్ ల్యాండ్ అగ్ని పర్వత పర్యాటకం

ఐస్ ల్యాండ్ ఒక దేశం.
దాదాపు మూడున్నర లక్షల జనాభా.
అక్కడ ఒక ప్రయివేటు భూమిలో ఒక కొండ.
అది అగ్ని పర్వతం. ఆ అగ్ని పర్వతం బద్దలయ్యింది.
స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ పర్వతాల తెల్లటి మంచు కొండలు చూడ్డానికి జనం ఎగబడినట్లే-అగ్ని పర్వతాలను కూడా చూసి తీరాలనుకునేవారు కోకొల్లలు.

ఐస్ ల్యాండ్ చట్టాల ప్రకారం ప్రయివేటు వ్యక్తుల భూముల్లో పబ్లిగ్గా ఎవరయినా తిరగవచ్చు. ఒకవేళ ఎవరినయినా భూ యజమాని అడ్డుకుంటే అది నేరం. అందువల్ల తాజాగా గుండె పగిలి మండుతున్న అగ్ని పర్వతాన్ని చూడ్డానికి తండోపతండాలుగా వస్తున్న టూరిస్టులను నియంత్రించలేక ఆ ప్రయివేటు అగ్నిపర్వతం యజమానికి తలకు మించిన భారమై ఆయన గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి.

అయితే ప్రయివేటు పొలాల్లో టూరిస్టులు పంటలను పాడు చేస్తేనే-ప్రవేశాన్ని అడ్డుకోవడానికి యజమానికి హక్కు ఉంటుంది. బాబ్బాబూ! పండే పంటలను తొక్కకుండా మండే అగ్నిపర్వతాన్ని చూస్తూ కూర్చోండి అని యజమాని వచ్చినవారిని అగ్ని సాక్షిగా ప్రాధేయపడుతున్నాడు. అది ఐస్ ల్యాండ్ కాబట్టి అగ్ని పర్వతం చూడవచ్చిన టూరిస్టులు కూడా బుద్ధిగా వింటున్నారు.

రోజు రోజుకూ టూరిస్టులు పెరిగితే ఎవరెస్టు మీద కూడా లే అవుట్లు వేసి ఒక్కో కొండ కొనను ఒక్కొక్కరి పేర రిజిస్టర్ చేయడం ఆధునిక రియల్ ఎస్టేట్ ఆనవాయితీ. ఐస్ ల్యాండ్ అగ్ని పర్వతానికి టూరిస్టుల తాకిడి పెరిగే సరికి- రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి అగ్నిపర్వతం యజమానికి హాట్ కేకుల్లాంటి ఆకర్షణీయమయిన ఆఫర్లు వస్తున్నాయి. నిప్పుల కొండ, ఆ కొండతో పాటు చుట్టూ వ్యవసాయ భూమి మొత్తం టోకున కొంటాం- రేటెంతో చెప్పు అని ఆయన వెంటపడుతున్నారు. ఇప్పుడది చల్లటి ఐస్ ల్యాండ్ లో నిజంగా అత్యంత హాట్ ప్రాపర్టీ!

ఓ శుభ ముహూర్తాన బద్దలయిన అగ్ని పర్వతాన్ని, చుట్టూ ఉన్న పొలాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ యజమాని అమ్మేశాడని అనుకుందాం. అప్పుడు ఇలాంటి పర్యాటక ప్రకటనలు రావచ్చు.

అగ్ని పర్వతం పిలుస్తోంది!
రా! కదిలి రా!
ఒళ్లు కాలే వేడి వేడి కాటేజుల్లో ఉండాలనుకుంటున్నారా?
రండి ఐస్ ల్యాండ్ అగ్ని పర్వతం మీకోసం ఎదురు చూస్తోంది.

అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న కాళ్ల పారాణి కూడా ఆరని దంపతులకు అగ్ని పర్వత సానువుల చెంత పొగల సెగల హనీమూన్ కాటేజీలు ప్రత్యేకం.
అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అనుకుంటూ గడపడంతో మీ కడుపులు చల్లబడి చచ్చుబడి ఉంటాయి. మా మండే గుండెల కొండల బండల దగ్గరికి రండి. అమ్మ కడుపు వెచ్చగా, అత్త కడుపు వెచ్చగా అని వేడి వేడి పాటల ఆవిర్లతో వేడెక్కి పోవచ్చు.

గుండెల మీద ఎన్నో కుంపట్లతో నలిగిపోయే మీకు బండలు పెటిల్లున పగిలే ఈ అగ్ని పర్వతం గొప్ప ఉపశమనం కాగలదు. కొండ గుండె మంట ముందు- మీ గుండె మంట మంటే కాదని మీరే ఒప్పుకుంటారు. ఉష్ణం ఉష్ణేన శీతలం అని శాస్త్రం ఎందుకు సిద్ధాంతీకరించిందో మీకే వేడిగా అర్థమవుతుంది.
అగ్ని పర్వతం ఏరియల్ వ్యూకు హెలిక్యాపిటర్లు కూడా ఉన్నాయి.

ఆధ్యాత్మికత ఉన్నవారికి లైవ్ హోమగుండాలను అగ్ని పర్వతంలోనే అనువుగా అమర్చి పెట్టాం.
అగ్నులు మూడు రకాలు. సహజాగ్ని ఇది నాలుగో రకం.
ఆరని నిప్పు ముద్దలను ప్రత్యేకంగా ప్యాక్ చేసి అమ్మకానికి పెట్టాం.
మీ అవసరాన్ని బట్టి కణ కణ మండే నాలుగు నిప్పు ముద్దలను మీరు సావనీర్ లుగా తీసుకెళ్లవచ్చు.
చివరకు మిగిలేది బూడిదే.
వెళుతూ వెళుతూ శ్రేష్ఠమయిన పిడికెడు అగ్ని పర్వతం ప్రసాదించిన తాజా బూడిద వెంట తీసుకెళ్లవచ్చు.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్